అక్షరటుడే వెబ్‌డెస్క్: ChatGPT for Teens | యువత డిజిటల్ వాతావరణాన్ని మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు ప్రముఖ సంస్థ ఓపెన్‌ఏఐ ( OpenAI ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’ అనుభవాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే కాకుండా, వారిలో విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా దీన్ని రూపొందించారు.
ChatGPT for Teens | ఆటోమేటిక్ యాక్టివేషన్..
ఈ ప్రత్యేక మోడ్ యూజర్ నమోదు చేసిన వయసు ఆధారంగా లేదా సిస్టమ్‌లో ఉండే ఏజ్-ప్రెడిక్షన్ టెక్నాలజీ సహాయంతో 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిని గుర్తిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రత్యేక మోడ్‌ను ఆటోమేటిగ్గా యాక్టివేట్ చేస్తుంది. అయితే 13 ఏళ్లలోపు పిల్లలకు దీని వినియోగం నిషిద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్లోబల్‌గా ఫ్రీ , పెయిడ్ వెర్షన్లలో ఇది అందుబాటులోకి వస్తోంది.
ChatGPT for Teens | ‘స్టడీ మోడ్’ ప్రత్యేకత..
ఈ కొత్త వెర్షన్‌లో ‘స్టడీ మోడ్’ అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా విద్యార్థులు హోంవర్క్ లేదా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు కాపీ-పేస్ట్ చేసే పద్ధతికి ఇది స్వస్తి పలుకుతుంది. టీనేజర్లు సులభంగా హోంవర్క్ పూర్తిచేయాలని చూసినప్పుడు ‘రెస్పాన్సిబుల్ హోంవర్క్ రిమైండర్స్’ వారిని స్టడీ మోడ్‌కు మళ్లిస్తాయి. ఇక్కడ ఏఐ నేరుగా జవాబులు ఇవ్వకుండా, ఎదురు ప్రశ్నలు అడుగుతూ, దశలవారీగా ఆలోచించి సమస్యను స్వయంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహిస్తుంది. దీనికి తోడు క్విజ్‌లు, లెర్నింగ్ విజువలైజేషన్స్ వంటి అడ్వాన్స్‌డ్ టూల్స్‌తో పాటు ‘స్టడీ అవర్స్’ సెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ChatGPT for Teens | పేరెంటల్ కంట్రోల్స్ , ప్రైవసీ..
టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇందులో కఠినమైన సెక్యూరిటీ ఫీచర్లను డిఫాల్ట్‌గా పొందుపరిచారు. స్వీయ-హాని, హింస, ప్రమాదకర కార్యకలాపాలు, రొమాంటిక్ చాటింగ్ , లైంగిక పరమైన కంటెంట్‌పై స్పష్టమైన పరిమితులు వర్తిస్తాయి. అలాగే సుదీర్ఘ వినియోగంపై బ్రేక్ రిమైండర్లు వంటి డిజిటల్ వెల్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ అకౌంట్‌ను టీన్ అకౌంట్‌తో లింక్ చేసి వాయిస్ మోడ్, ఇమేజ్ జనరేషన్, ‘క్వైట్ అవర్స్’ను నియంత్రించవచ్చు. అదే సమయంలో టీనేజర్ల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా వారి చాట్ సందేశాలను చదివే వీలు తల్లిదండ్రులకు ఉండదు.
ఇది కూడా చదవండి: Tamil Nadu free cars | ఉచిత కార్లు మాకొద్దు.. డీఎంకే ఎమ్మెల్యేల ప్రకటన