అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Congress Criticism | కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మే 10న బెంగళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ తన సొంత మిత్రపక్షాలను, ఓటర్లను సైతం వంచిస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల బలహీనతను ఆసరాగా చేసుకుని మనుగడ సాగించే “పరాన్నజీవి రాజకీయ శక్తి”గా కాంగ్రెస్‌ను ఆయన అభివర్ణించారు.
Modi Congress Criticism | అబద్ధపు హామీలు ..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వరుసగా రెండోసారి గెలవలేకపోతోందని, అధికారం చేపట్టిన కొద్ది నెలలకే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలు అబద్ధాలని, వారి నిఘంటువులో ‘పాలన’ అనే పదమే లేదని ఎద్దేవా చేశారు. తమిళనాడులో తన మిత్రపక్షమైన డీఎంకేకు కూడా కాంగ్రెస్ ద్రోహం చేసిందని, రాజకీయ అవసరాల కోసం ఎప్పుడైనా మిత్రపక్షాలపై తిరగబడే నైజం ఆ పార్టీదని ఆరోపించారు.
Modi Congress Criticism | రాజ్యాంగ వ్యవస్థలపై ద్వేషం..
ఎన్నికల ఓటములను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మోదీ మండిపడ్డారు. ఓటమికి బాధ్యత వహించకుండా న్యాయస్థానాలు, ఎన్నికల ప్రక్రియలు, రాజ్యాంగంపై నిందలు వేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన కాంగ్రెస్, నేడు 100 సీట్లు సాధించడానికి కూడా ఇబ్బంది పడుతోందని ఆయన గుర్తు చేశారు.
Modi Congress Criticism | దక్షిణాదిలో బీజేపీ విస్తరణ..
బీజేపీ ఎదుగుదలను ప్రస్తావిస్తూ.. గతంలో బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేల బలం ఇప్పుడు గణనీయంగా పెరిగిందని మోదీ చెప్పారు. త్వరలోనే కేరళలో కూడా బీజేపీ-ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Modi Congress Criticism| కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతర్గత కలహాలతో సతమతమవుతున్నాయని మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఉన్న అనిశ్చితిని ప్రస్తావిస్తూ, పాలన కంటే కుర్చీని కాపాడుకోవడానికే నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారతీయులంతా ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: POCSO Allegations | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన ట్వీట్!

