అక్షరటుడే వెబ్‌డెస్క్: Nellore Boy Viral | “పిల్లలు దేవుడితో సమానం, వారికి అబద్ధం చెప్పడం రాదు” అనే నానుడిని ఓ ఆరేళ్ల బాలుడు నిజం చేశాడు. పోలీసుల తనిఖీలకు భయపడి తన బైక్‌ను రహస్యంగా దాచిన తండ్రి గుట్టును, ఆ చిన్నారి తన అమాయకత్వంతో అందరి ముందూ రట్టు చేశాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ వినూత్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Nellore Boy Viral | అసలేం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తూ వాహనాల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇది గమనించిన సురేష్ అనే స్థానిక వ్యక్తి.. తన బైక్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ (పొల్యూషన్ తదితర సర్టిఫికెట్లు) సరిగ్గా లేకపోవడంతో జరిమానా పడుతుందని కంగారుపడ్డాడు. పోలీసుల కంటపడకుండా ఆ బండిని పక్క వీధిలో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు.
Nellore Boy Viral | కొడుకే స్వయంగా చూపించడంతో..
సురేష్ ఆరేళ్ల కొడుకు మహేంద్ర.. పోలీసుల రాకను గమనించి ఎంతో అమాయకంగా వారి దగ్గరకు వెళ్లాడు. “మీరు వస్తున్నారని ముందే తెలిసి మా నాన్న బండిని పక్క వీధిలో దాచిపెట్టాడు” అని పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతటితో ఆగకుండా, నేరుగా పోలీసుల చేయి పట్టుకుని మరీ బండి ఉన్న చోటుకు తీసుకెళ్లి చూపించాడు.
బాలుడి ఈ అమాయకత్వాన్ని చూసి అక్కడున్న పోలీసులతో పాటు స్థానికులు కూడా నవ్వుకున్నారు. నిబంధనల ప్రకారం పత్రాలు లేని ఆ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. చిన్న వయసులోనే తండ్రి చేసిన చాతుర్యాన్ని బయటపెట్టిన ఈ బుడతడి వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
#Nellore : పోలీసుల కార్డెన్ సెర్చ్‌లో ఆసక్తికర ఘటన!
పోలీసుల తనిఖీలు జరుగుతుండటంతో ఓ వ్యక్తి తన బైక్‌ను వేరే వీధిలో దాచాడు
విషయం తెలిసిన అతడి ఆరేళ్ల బాలుడు పోలీసుల వద్దకు వెళ్లి.. తన తండ్రి బైక్ దాచిన విషయాన్ని చెప్పిన చిన్నారి#Ananthasagaram #CardonSearch #viralvídeo pic.twitter.com/nzhEhY4cnJ
— ANN Telugu (@ANN_Telugu) August 21, 2026
ఇది కూడా చదవండి: NSUI Leaders Suspension | ఎన్ఎస్యూఐ నాయకులపై సస్పెన్షన్ రద్దు