అక్షరటుడే, వెబ్‌డెస్క్: Secunderabad Arms Theft | సికింద్రాబాద్‌లోని అత్యంత భద్రత కలిగిన ఆర్మీ ప్రాంగణంలో భారీగా ఆయుధాలు చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ గదిలో తాళం పగలగొట్టి ఆయుధాలను అపహరించినట్లు ఆర్మీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మొత్తం 12 ఆయుధాలు మిస్సైనట్లు గుర్తించారు. వీటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టల్స్, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
Secunderabad Arms Theft | అత్యంత భద్రత మధ్య చోరీ
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ రెజిమెంట్‌లోకి చొరబడి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. గది తాళం పగలగొట్టిన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. ఆయుధాలు ఎప్పుడు, ఎలా మాయమయ్యాయనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy Messi | మీ ప్రయాణం ఓ స్ఫూర్తి : మెస్సీ వీడ్కోలుపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం!
Secunderabad Arms Theft | బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు
ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెజిమెంట్‌లో పనిచేసే సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ–నిష్క్రమణ వివరాలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
Secunderabad Arms Theft | అత్యంత సున్నితమైన ఘటనగా దర్యాప్తు
ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఈ ఘటనను అత్యంత సున్నితమైన భద్రతా అంశంగా అధికారులు పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీ వెనుక ఎవరి ప్రమేయం ఉంది? భద్రతా వలయాన్ని ఎలా దాటారు? ఆయుధాలు ఎక్కడికి తరలించారు? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం.