అక్షరటుడే, కామారెడ్డి: CPS Pension Protest | సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంలో ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి (Kamareddy) శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగులు మధ్యాహ్న భోజనం విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోహ దినం పాటించారు. ఉద్యోగుల నిరసనకు అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి మద్దతు తెలిపారు.
CPS Pension Protest | 10న హైదరాబాద్‌లో మహాధర్నా..
ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 10న హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహించనున్నామని, ఈ ధర్నా చరిత్రాత్మక ఘట్టంగా మిగలబోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మేనిఫెస్టోను కేవలం ఓట్లు దండుకోవడానికి కాకుండా అకౌంటబిలిటీతో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక సీఎం ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. సీపీఎస్ పై ఇప్పటివరకు కమిటీ కూడా వేయలేదని, తాము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
CPS Pension Protest | ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం..
లాబీయింగ్ ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10నాటి ధర్నాను ఉద్యోగ సంఘాల నాయకత్వం వాయిదా వేసేందుకు సిద్ధమైనా కిందిస్థాయి ఉద్యోగులు సిద్ధంగా లేరన్నారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులను మాత్రమే తాము అడుగుతున్నామని తెలిపారు. పీఆర్సీ కమిటీ వేసి మూడేళ్లు అవుతున్నా ఇంకా అమలు చేయలేదని, వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలు బకాయి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం కావాలని, తమ సొమ్ముతో ట్రస్ట్ ఏర్పాటు చేసినా హెల్త్ కార్డులు సరిగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పాఠశాలల మూసివేతలు ఆపివేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, రాష్ట్ర కో కన్వీనర్ అనిల్ కుమార్, జిల్లా కన్వీనర్ డా.దేవేందర్, ఉద్యోగ సంఘాల నాయకులు ఆకుల బాబు, పంపరి ప్రవీణ్ కుమార్, లింగం, నాగరాజు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Urea Shortage | రైతులకు ‘యాప్’సోపాలు.. క్షణాల్లో ఖాళీ అవుతున్న యూరియా