అక్షరటుడే, కామారెడ్డి: Cable Wire Theft | బోర్ మోటార్ కేబుల్ వైర్ల దొంగల ముఠాను భిక్కనూర్ పోలీసులు (Bhikkanoor Police) అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
Cable Wire Theft | అంతంపల్లి గ్రామానికి చెందిన..
అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు జీడి భీమయ్య తన పొలంలోని బోర్ మోటార్ స్టార్టర్ బాక్స్‌ను సెప్టెంబర్ 3న సాయంత్రం పరిశీలించి గదికి తాళం వేసి వెళ్లగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. పరిసర పొలాల్లోనూ ఇదే తరహా దొంగతనాలు జరగడంతో ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, భిక్కనూర్ సీఐ నరేష్, ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. నిందితులు రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లి కేబుల్ వైర్లు కట్ చేసి, వాటిని పెట్రోల్‌తో కాల్చి రాగి తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఉగ్రవాయి, బస్వాపూర్, అంతంపల్లి శివారుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బోరెడ్డి నరేందర్ రెడ్డి, మోహన్ అలియాస్ బైరాం మోహన్, బిచగాని అలియాస్ అండాసి శ్రీకాంత్, బంటు రామ్ చరణ్‌లను అరెస్టు చేశారు. దొంగిలించిన రాగిని అమ్మి డబ్బు పంచుకుని మళ్లీ దొంగతనానికి వెళ్తుండగా బిక్కనూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో సీసీఎస్, బిక్కనూర్ కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాగి తీగలు, కట్టర్లు, ఇనుప రాడ్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: మహిళలకు ర్యాపిడో గుడ్ న్యూస్