అక్షరటుడే, బోధన్: 22A Prohibited Lands | జిల్లాలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది. అత్యవసరానికి.. చదువులు, వివాహాల కోసం తమ స్థిరాస్తి, భూములను విక్రయించుకోవాలనుకునే తలనొప్పిగా మారింది. తమ భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అయితే భూముల రిజిస్ట్రేషన్లలో మాత్రం సబ్రిజిస్ట్రార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
22A Prohibited Lands | రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు..
జిల్లాలోని బోధన్ (Bodhan) పట్టణంలో పలు కాలనీల్లో భూమలు, ఇళ్ల స్థలాలు 22ఏ నిషేధిత జాబితాలో వెళ్లినట్లుగా తెలుస్తోంది. పట్టణంలోని శక్కర్‌నగర్, ఆచన్‌పల్లి, వెంకటేశ్వరనగర్, రాకాసీపేట్ తదితర కాలనీల్లో స్థలాలు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లుగా సమాచారం. ఆయా కాలనీల్లో ప్రజలు తమ ఇళ్లు, స్థలాలు 22ఏలోకి వెళ్లాయని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. అసలు ఏమిటీ 22ఏ జాబితా ఇందులోకి తమ ఇళ్లు ఎందుకు వెళ్లాయని లబోదిబోమంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చే నాథుడు లేకపోవడంతో చాలామంది కలెక్టరేట్‌కు వెళ్తున్నారు.
22A Prohibited Lands | బెల్లాల్ ప్రాంతంలో..
బోధన్ పట్టణంలోని బెల్లాల్ రోడ్లో ఉన్న సర్వే నంబర్ 258లో భూమిని నిజాం షుగర్స్ వద్ద నుంచి పోలీస్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. ఈ సర్వే నంబర్లో సుమారు 250కి పైగా ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. అయితే విస్తుపోయే విషయమేమిటంటే ఈ సర్వే నంబర్లోని పోలీస్ కాలనీ మొత్తం నిషేధిత జాబితాలో చేరినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక బాధితులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ, పట్టణం చుట్టు పక్కన మండలాల్లోని భూములు సైతం ఈ జాబితాలోకి వెళ్లాయి. ఈ జాబితాలోకి వెళ్లిన స్థలాలు, ఇళ్ల క్రయవిక్రయాలను ప్రభుత్వం నిషేధించింది.
22A Prohibited Lands | అసలు ఏమిటీ 22ఏ జాబితా..
రిజిష్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం.. ప్రభుత్వం కొన్ని భూములను ఎవరూ కొనకుండా..విక్రయించకుండా రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకుండా నిషేధిత జాబితాలో పెడుతుంది. ప్రభుత్వాలు ప్రజా ఆస్తులను, ప్రభుత్వ భూములను రక్షించేందుకు ఈ అస్త్రం ప్రయోగిస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే సాధారణ ప్రజలు భూములు, ఇళ్లు సైతం ఈ జాబితాలోకి చేరాయి. అయితే ఇటీవల రికార్డుల డిజిటలైజేషన్ (ధరణి నుంచి భూభారతి వ్యవస్థకు మార్చే క్రమంలో), కొన్ని సాంకేతిక కారణాలతో సాధారణ పట్టా భూములు, ఇళ్లు సైతం ఈ జాబితాలోకి వెళ్లినట్లు సమాచారం.
22A Prohibited Lands | రిజిస్ట్రార్ కార్యాలయానికి కాసుల పంట..
‘22ఏ నిషేధిత జాబితా’ను అడ్డుపెట్టుకుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు దోచుకుంటున్నాయని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. క్రయవిక్రయాల నిమిత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లిన దరఖాస్తుదారుడు పక్కా లింక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినప్పటికీ సదరు భూమి నిషేధిత జాబితాలో ఉంది.. రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ మొదట సబ్ రిజిస్ట్రార్లు మొకాలడ్డు వేస్తున్నారు. అనంతరం బ్రోకర్లు రంగప్రవేశం చేసి వారిరువురి మధ్య బేరసారాలు కుదుర్చి గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సాధారణ వ్యక్తులకు మాత్రం సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం : సుదర్శన్ రెడ్డి