అక్షరటుడే, బోధన్: Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) నగరంలోని సీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Fake Certificates | బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో..
పట్టణం(Bodhan) రాకాసిపేట్‌లో ‘సహారా మీ సేవ కేంద్రం’లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. తనిఖీలో మీసేవ ఆపరేటర్ షేక్ వసీమ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గత రెండేళ్ల నుంచి మీసేవ యజమాని మహమ్మద్ ముక్రం, ఇతరులతో కలిసి మీసేవ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సర్టిఫికెట్లు తయారు చేసి వాటిపై స్టాంపులు వేసి.. అసలు సర్టిఫికెట్లుగా తయారు చేసి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసి పంచుకునేవారు.
ఈ బాగోతాన్ని పసిగట్టిన పోలీసులు ప్రధాన సూత్రధారులైన షేక్ వసీం, మహహ్మద్ ముక్రంలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు నకిలీ సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలు, రబ్బర్ స్టాంప్, నకిలీ టీసీ, బోనాఫైడ్లు, షాదీ ముబారక్ సర్టిఫికెట్, కలర్ప్రింటర్ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న సీసీఎస్ సీఐ అజయ్, ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ అనిల్, గంగప్రసాద్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ, ఎస్సై రాం, కానిస్టేబుల్ గంగారం, శివ కృష్ణను సీపీ అభినందించారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్.. బిగ్ సర్ప్రైజ్