అక్షరటుడే, భీమ్‌గల్ : Food Adulteration | ఆహార ఉత్పత్తులు, ఔషధాల కల్తీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఔషధ నియంత్రణ యంత్రాంగం (డీసీఏ), ఆహార భద్రత విభాగాలను విలీనం చేసింది.
క్షేత్రస్థాయిలో కల్తీ రాయుళ్లపై నిఘా పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి జిల్లాల్లో ప్రజారోగ్యంతో చెలగాటమాడే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు మార్గం సుగమమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తెలంగాణ సేఫ్’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని కమిషనర్‌గా ఐపీఎస్ అవినాశ్ మొహంతిని నియమించింది. అంతేగాకుండా పోలీసు శాఖ నుంచి పలువురిని దీనికి పంపాలని ఆదేశించింది. మూడు ప్రధాన విభాగాల నుంచి దాదాపు 1,500 మంది సిబ్బందిని కేటాయించేందుకు నివేదికలు సిద్ధమయ్యాయి. నమోదయ్యే కేసుల సమర్థవంతమైన విచారణ, చట్టపరమైన చర్యల పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కల్తీ నిరోధక విభాగాన్ని మొత్తం 4 ప్రత్యేక జోన్లుగా విభజించి నిరంతర తనిఖీలు చేపట్టనున్నారు.
Food Adulteration | ఉమ్మడి జిల్లాలో..
ఇటీవల ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఆహార భద్రతా టాస్క్‌ఫోర్స్ అధికారులు జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. నిజామాబాద్ నగరంలోని లహరి హోటల్ పై జరిపిన తనిఖీల్లో ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచిన దాదాపు 122 కిలోల కుళ్లిన మాంసాన్ని, రూ.30వేల విలువైన నిషిద్ధ సింథటిక్ రంగులు, బూజు పట్టిన కూరగాయలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌లో గడువు తీరిన కారం, మసాలా పొడులు వాడడంతో పాటు సరైన గాలి, వెలుతురు లేని అపరిశుభ్ర వంటగదిని గుర్తించిన అధికారులు సదరు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. మిర్చి కాంపౌండ్ సమీపంలోని ఢిల్లీవాలా స్వీట్ హోమ్‌తో పాటు పలు మసాలా దినుసుల తయారీ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు లేకపోవడాన్ని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు.
Food Adulteration | సిలిండర్లు సీజ్
ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో అధికారులు దాడులు చేశారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుండడంతో చర్యలు చేపట్టారు. దాదాపు 65 సిలిండర్లను సీజ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు కలిగిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పక్క రాష్ట్రాల నుంచి కల్తీ పాలు, నాణ్యత లేని వంటనూనెలు, నకిలీ మసాలా దినుసులతో పాటు నిషిద్ధ ఔషధాల రవాణా జరుగుతోందనే ఫిర్యాదులున్నాయి. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో వీటికి చెక్ పడనుంది.
ఇది కూడా చదవండి..: Yellareddy Development | ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషిచేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్