అక్షరటుడే, డిచ్‌పల్లి: CMR Rice Scam | జిల్లాలో సీఎంఆర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నెలరోజుల్లోనే జిల్లాలోని బోధన్, ఖానాపూర్లోని రైస్‌మిల్లుపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.
CMR Rice Scam | సీఎంఆర్ ఎగ్గొట్టినట్లు విచారణలో వెల్లడి
గతంలో అధికారులు కేసులు నమోదు చేసిన రైస్‌మిల్లులు భారీ ఎత్తున ప్రభుత్వానికి సీఎంఆర్ ఎగ్గొట్టినట్లు రికార్డులు తేల్చాయి. తాజాగా డిచ్‌పల్లి (Dichpally)లోని ఓ రైస్‌మిల్ సైతం భారీ ఎత్తున సీఎంఆర్ మాయం చేసినట్లు తెలుస్తోంది. మండలంలోని సుద్దులం గ్రామ పరిధిలోని ఓం సాయి బాలాజీ రైస్‌మిల్లులో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం కేటాయించిన ధాన్యంలో 8,618 క్వింటాళ్లు గల్లంతైనట్లు దర్యాప్తులో తేలిందని ఎస్సై ఆరిఫ్ తెలిపారు. గల్లంతైన ధాన్యం విలువ సుమారు రూ.27,11,17,286 ఉంటుందని పేర్కొన్నారు.
CMR Rice Scam | 2022 నుంచి..
2022 నుంచి గతేడాది వరకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉండగా, అప్పగించకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైస్‌మిల్లు యజమానులు కూన వెంకటేష్, వరలక్ష్మి, ప్రియాంకలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆరిఫ్ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Food Adulteration | ‘కల్తీ’పై ఉక్కుపాదం.. నూతన విభాగం ఏర్పాటు చేసిన ప్రభుత్వం