అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad DMHO Harassment | వైద్య శాఖ అంటేనే నిమిషం విరామం లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్రమైన రంగం. కానీ, నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం (DM&HO) మాత్రం ఒక మానసిక నరకకూపంగా మారింది. సమీక్షా సమావేశం అంటే సలహాలు, సూచనలు ఇచ్చే వేదిక కాదు.. ఉద్యోగులను అణచివేసే, అవమానించే అరాచక స్థావరం!
“నల్ల మొఖాలు, దొంగలు, మీ మొఖం చూడాలంటే అసహ్యం.. మీరంతా వేస్ట్, మీకు జీతం ఇవ్వడం దండగ, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోండి!” – ఇవీ ఒక ఉన్నతాధికారి నోటి నుంచి నిత్యం జాలువారే ‘అమృత’ వాక్యాలు!
Nizamabad DMHO Harassment | మానసిక క్షోభతో నలిగిపోతున్న ఉద్యోగులు
ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి, సమీక్షల పేరిట నడిచే ఈ ‘దర్బార్’లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమాన హోదా కలిగిన సివిల్ సర్జన్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, Dy.DM&HO ల వరకు ఎవరికీ మినహాయింపు లేదు.
వ్యక్తిగత అవహేళనలు: సమీక్షలో అందరి ముందూ నిలబెట్టి, ఉద్యోగానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలను లాగుతూ వెటకారంగా మాట్లాడటం సదరు అధికారికి అలవాటు.
నోరెత్తితే వేధింపులే: “ఇది తప్పు” అని ఏ ఉద్యోగి అయినా సాహసించి చెప్పాడా.. అంతే సంగతులు! “నోరు మూయ్, వీడికి పనీ చేతకాదు, వీడిపై ఫైల్ పుట్ అప్ చేయ్” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
కక్షసాధింపు చర్యలు: ఎదురు తిరిగిన వారికి సెలవులు మంజూరు కావు, జీతాల్లో కోతలు, ఎంక్వైరీలు, వరుస మెమోల జారీతో మానసికంగా వేధించి లొంగదీసుకుంటారు.
- రాజీనామాలు, లాంగ్ లీవ్‌లు.. ఇవే సమాధానాలు! ఈ అధికారి వేధింపులు తాళలేక వ్యవస్థ ఎంతగా అతలాకుతలమైందో చెప్పడానికి ఇవే ఉదాహరణలు:
- సదరు అధికారి ధోరణి నచ్చక ఒక Dy.DM&HO స్థాయి అధికారి ఏకంగా రెండు నెలల లాంగ్ లీవ్‌పై వెళ్లాల్సి వచ్చింది.
- ఆరేళ్లుగా నమ్మకంగా పనిచేసిన ఒక ఉద్యోగి మనస్తాపంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
- అనుబంధంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థల (NGO) ఉద్యోగులు సైతం ఈ వేధింపులు భరించలేక వైదొలిగారు.
- కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, NHM ఉద్యోగులను అసలు మనుషులుగానే చూడకుండా, టెర్మినేట్ చేస్తామని, ఏజెన్సీలకు అటాచ్ చేస్తామని బెదిరించడం నిత్యకృత్యమైంది.
Nizamabad DMHO Harassment | ‘కోటరీ’ రాజ్యాంగం!
జిల్లా స్థాయి అధికారులు డిపార్ట్మెంట్ సమస్యలను విన్నవించుకుందామని వస్తే.. “నాకు చెప్పొద్దు, ఉన్నవాటితోనే చేయండి.. లేదా ఉద్యోగం మానేయండి” అని కఠినంగా ముఖం మీదే చెప్తారు.
అయితే, తన సొంత ‘కోటరీ’ చెప్పే మాటలను మాత్రం కళ్ళు మూసుకుని వింటారు. ముఖ్యంగా ఒక సీనియర్ అసిస్టెంట్ ఈ అధికారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Nizamabad DMHO Harassment | బదిలీ అయినా మళ్లీ వాలారు.. బెదిరింపులు పెంచారు!
గతంలో ఈ అధికారి వేధింపులపై ఉద్యోగ సంఘాలు, IMA, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఉద్యోగులు ఆనందంతో మిఠాయిలు పంచుకుని, వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకున్నారు.
కానీ, అంతలోనే ఏ అభయహస్తం లభించిందో తెలియదు.. తను తిరిగి అదే సీటులో వాలారు! వచ్చీ రాగానే.. “నేను వెళ్ళిపోతాను అనుకున్నారా? వెళ్ళాను, తిరిగి వచ్చాను.. మిమ్మల్ని అస్సలు వదలను” అంటూ స్టేటస్లు పెట్టుకున్న వారిపై కక్షగట్టి మరీ వేధిస్తున్నారు.
” Dy.DMHO స్థాయిలోనే ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం.. ఆఖరికి మేడమ్‌పై తిరగబడితే ఎక్కడ SC, ST అట్రాసిటీ కేసులు పెడతారోనని భయపడాల్సి వస్తోంది” – ఒక అధికారి ఆవేదన
Nizamabad DMHO Harassment | కలెక్టర్ విచారణ చేపట్టాలి!
ఒక అధికారి నియంతృత్వ వైఖరి వల్ల జిల్లా వైద్యారోగ్య శాఖ వ్యవస్థాత్మకంగా పతనం అవుతోంది. మానసిక ప్రశాంతత లేక నిత్యం నరకం చూస్తున్నామని ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, సదరు అధికారి వ్యవహార శైలి, ఉపయోగించే భాష, ఆర్థిక లావాదేవీలు, తన కోటరీపై పూర్తిస్థాయి అంతర్గత విచారణ జరిపించాలి.
ఉద్యోగులు భయం లేకుండా నిజాలు చెప్పడానికి అనువుగా వారి అభిప్రాయాలను గోప్యంగా (Confidential) సేకరించి, శాఖను ఈ ‘నియంత’ పిడికిలి నుంచి కాపాడాలని బాధితులు కోరుతున్నారు.