అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad Drought Mandals | ఎల్నినో ప్రభావం అన్నదాతలపై పడింది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికి వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడంతో ఆగం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 22 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడంతో ఇటు అన్నదాతలు, అటు సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Nizamabad Drought Mandals | వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో..
ఉమ్మడి జిల్లాలో కరువు కోరలు చాస్తోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల పరిస్థితిని అంచనా వేసి ఉమ్మడి జిల్లాలోని 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉండటంతో రైతులు, సామాన్య ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో 22 మండలాలు మోస్తరు కరువు జాబితాలో ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో జుక్కల్, పెద్ద కొడప్గల్, సదాశివనగర్, మహమ్మద్ నగర్ మండలాలను , నిజామాబాద్ జిల్లాలో నవీపేట్, నందిపేట్, ఆర్మూర్, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, వేల్పూర్, మాక్లూర్, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ సౌత్, ముగ్పాల్, ఇందల్వాయి, మోస్రా, చందూర్, ఆలూర్, వర్ని, పోతంగల్ మండలాలు కరువు జాబితాలో చేరాయి.
Nizamabad Drought Mandals | ఆరుతడి పంటలపై అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడి వర్షాలు తగ్గిపోయాయి. దీంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో పండే జొన్న, సజ్జ, మినుము, పెసర, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలు వేస్తే కరువు పరిస్థితుల్లో కూడా కొంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులందరూ వరి పంట మీదనే ఆధారపడ్డారు. కానీ వరి సాగుకు ఎకరాకు వేల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం నీటి లభ్యత లేని పరిస్థితుల్లో వరి వేస్తే పంట ఎండిపోయి పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈ యాసంగిలో వరి సాగును వీలైనంత తగ్గించుకోవాలని, తప్పని పరిస్థితుల్లో అయితే తక్కువ కాలంలో పండే వరి రకాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Nizamabad Drought Mandals | నీటిని పొదుపుపై సూచనలు
కరువు మండలాల్లో ప్రతి నీటిచుక్క బంగారంతో సమానం. అందుబాటులో ఉన్న నీటిని బిందుసేద్యం, తుంపర సేద్యం ద్వారా పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా బోర్లు వేయడం, నీటిని వృథా చేయడం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. కరువు మండలాలకు ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలైన పంట రుణాల వసూలు వాయిదా, ఉపాధి హామీ పని దినాల పెంపు, తాగునీటి ట్యాంకర్ల సరఫరా, పశుగ్రాసం కేంద్రాల ఏర్పాటు వంటి వాటిని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులు వింటాకా,,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇక్కడ వరిసాగు ఎక్కువ. రైతులకు సైతం వరిసాగు తప్ప ఇతర పంటలపై అంతగా ఆసక్తి లేని పరిస్థితి. సీజన్ పరిస్థితులు ఎలా ఉన్నా ఎక్కువగా వరిసాగు వైపే అన్నదాతలు దృష్టి సారిస్తారు. ఇప్పటికే అది రుజువైంది కూడా. గత సీజన్ పూర్తికాక ముందునుంచే ఆరుతడి పంటలే వేయాలని అధికారులు సూచించినా రైతులు లక్షల ఎకరాల్లో వరిపంట వేశారు. అయితే ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరిసాగు వద్దంటే వినే పరిస్థితి ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు నేరుగా అధికారులు వెళ్లి అవగాహన కల్పించలేదన్న టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి..: Firecracker Shops | పటాకుల దుకాణాల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య