Telangana Politics | అసెంబ్లీలో లేని కేసీఆర్ చుట్టూనే సభ.. కాంగ్రెస్ ‘కేసీఆర్ నామజపం’ వ్యూహమా? వికటించే ముప్పుందా?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Politics | తెలంగాణలో అధికారం మారినా రాజకీయ చక్రం మాత్రం కేసీఆర్ చుట్టూనే తిరుగుతోందా? ప్రత్యక్షంగా మైక్‌ల ముందుకు రాని, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూనే అధికార కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలను రచిస్తోందా? అంటే అవుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రజా సమస్యలు, పాలనా మైలురాళ్లపై జరగాల్సిన చర్చలు పక్కనపడేసి.. వ్యక్తిగత విమర్శలే ప్రాధాన్య అంశాలుగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Telangana Politics | తెరవెనుక కేసీఆర్.. సభలో మాత్రం ఆయన పేరే ప్రతిధ్వని!

2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. రాజకీయ సభలు, బహిరంగ ప్రసంగాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం ఆయనను మళ్లీ ప్రజాక్షేత్రంలో కేంద్రబిందువుగా మారుస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

కేసీఆర్‌ పైనే ప్రధాన దృష్టి: కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను ముందుకు తెస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సమయాన్ని గడుపుతోందే తప్ప, కొత్త అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన ముద్ర వేయలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫార్మ్‌హౌస్ ముట్టడుల రాజకీయం: అసెంబ్లీ సమావేశాల వేళ ప్రజా సమస్యలపై చర్చించకుండా, మంత్రులు, నేతలు ఎర్రవల్లిలోని ఫార్మ్‌హౌస్ వైపు దృష్టి సారించడం సభా నిబంధనలకే కాక ప్రజాప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారుతోంది.

Telangana Politics | డైవర్షన్ పొలిటిక్స్? కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

ప్రభుత్వంలో ఏర్పడే వ్యతిరేకతను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ఈ రకమైన “కేసీఆర్ నామజపం” చేస్తోందా.. అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సానుకూల నిర్ణయాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమై, కేవలం కేసీఆర్‌ను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

ఎమ్‌ఎల్‌సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్.. చట్టాన్ని అతిక్రమిస్తే ఉక్కుపాదమే!

వ్యక్తిగత విమర్శల స్థాయి పెరగడం: కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే క్రమంలో.. ఆయన వయసును, ఆరోగ్యాన్ని ఉద్దేశించి అసెంబ్లీ వేదికగానూ, బయటకూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిపై ఇటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌నే తిరిగి దెబ్బ తీసే ప్రమాదముంది.

Telangana Politics | అసెంబ్లీ రచ్చ – ప్రజాధనం వృథా!

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి గానీ.. పరస్పర ఆరోపణలు, గందరగోళాలకు వేదికగా మారకూడదు. ఒక నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయాలనుకునే ప్రయత్నం, ఆ నాయకుడికి సానుభూతి తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పదే పదే కేసీఆర్‌పైనే ఆధారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు దీర్ఘకాలంలో లాభించదు.

ప్రభుత్వం తన పథకాలను, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే తన ఉనికిని నిలబెట్టుకోవాలి తప్ప, ప్రతిపక్ష నేతనే కేంద్రంగా చేసుకుని కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గే ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
6 Comments