అక్షరటుడే, వెబ్‌డెస్క్: CPS Pension Issues | ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బి. దామోదర్ రావు. రిటైర్డ్ SGT ఉపాధ్యాయుడు. ఆయన చివరిగా తీసుకున్న బేసిక్ పే అక్షరాలా ₹91,000. కానీ, ఆయనకు ప్రస్తుతం వస్తున్న CPS పెన్షన్ ఎంతో తెలుసా? కేవలం ₹4,200!
నలుగురికి చదువు (study) చెప్పి, భవిష్యత్తును తీర్చిదిద్దిన ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యాక ఏం చేయాలి? ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. కానీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) మహిమతో ఆ ఉపాధ్యాయుడు ఇప్పుడు పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది!
CPS Pension Issues | నాడు జ్ఞానబోధ.. నేడు పల్లీల వ్యాపారం!
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలకు గుడ్డ చుట్టుకుని, మెడలో తన పెన్షన్ వివరాల ప్లకార్డ్ వేలాడేసుకుని, పల్లీల బుట్ట పట్టుకుని నిరసన తెలుపుతున్న దామోదర్ రావు దృశ్యం.. నేటి CPS బాధితుల దుస్థితికి నిలువెత్తు నిదర్శనం.
దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? నెలకు ₹400 కూడా పెన్షన్ రాని రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో ఉన్నారు. ఈ పెన్షన్‌తో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? కనీసం మందుల ఖర్చులకు కూడా ఆ డబ్బులు సరిపోవంటే అతిశయోక్తి కాదు.
CPS Pension Issues | ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం!
CPS అంటే ‘కష్టపడి పనిచేస్తే.. చివరికి సున్నా’ అనే చందంగా మారింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) ఉన్నప్పుడు ఉద్యోగికి సామాజిక, ఆర్థిక భద్రత ఉండేది. కానీ మార్కెట్ ఆధారిత CPS వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి.
సర్కారు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏ, ఐదేళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన ఫిట్‌మెట్, కానీ పీఆర్సీ కానీ ప్రకటిస్తే.. పాత పెన్షన్ విధానంలో రిటైర్డ్ ఉద్యోగికి వచ్చే పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది.
కానీ ఈ కొత్త సీపీఎస్ విధానంలో మాత్రం ఒకసారి ఎంతైతే ఫిక్స్ చేస్తారో.. ఇక జీవితాంతం దానితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఉదాహరణకు మొదట రూ.500 పెన్షన్ అందుకుంటే ఇక జీవిత కాలం అంతే మొత్తం ఇస్తారన్నమాట.
అంటే దీనికన్నా వృద్ధాప్య పింఛను బెటర్‌గా ఉంటుంది. పాత పెన్షన్ విధానం (OPS) సాధించుకోకపోతే.. భవిష్యత్తులో సీపీఎస్ ఉద్యోగులందరి పరిస్థితి ఇలాగే మారక తప్పదని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
CPS Pension Issues | ప్రభుత్వాల వైఖరిపై విమర్శలు
ఓట్ల కోసం ఉచిత పథకాలకు రూ.వేల కోట్లు కుమ్మరించే ప్రభుత్వాలకు.. ఏళ్ల తరబడి సమాజ శ్రేయస్సు కోసం శ్రమించిన ఉద్యోగుల భద్రత మాత్రం పట్టడం లేదు. ‘ఉద్యోగికి విశ్రాంత జీవితంలో భద్రత ఇవ్వలేని పాలన ఏపాటిది?’ అని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
CPS Pension Issues | మన ప్రజాప్రతినిధుల కథ వేరు!
దేశంలో సామాన్య ఉద్యోగికి, ప్రజాప్రతినిధులకు మధ్య ఉన్న విపరీతమైన తారతమ్యానికి, వ్యవస్థలోని విపరీత వ్యంగ్యానికి ఈ సీపీఎస్ దుస్థితి సజీవ సాక్ష్యం.
30-35 ఏళ్ల పాటు నిరంతరం సమాజానికి, ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందితే.. వారికి సీపీఎస్ కింద దక్కేది కంటితుడుపుగా వచ్చే పెన్షన్‌తో పొట్టకూటి కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
కాగా, కేవలం ఐదేళ్లు ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో పనిచేస్తే చాలు.. వారికి జీవితాంతం నెలకు రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు రాయల్ పెన్షన్ గ్యారెంటీ!
అదొక్కటే కాదు.. ఒకవేళ ఒక నేత ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా వేర్వేరుగా లేదా పలు టర్ములు గెలిస్తే.. ప్రతి టర్మ్‌కు అదనపు పింఛన్ల వెసులుబాటు, జీవితాంతం ఉచిత వైద్యం, ప్రయాణ అలవెన్సులు అదనం!
అంటే ఐదేళ్ల ‘రాజకీయ సేవ’కి జీవితాంతం బంగారం లాంటి సెక్యూరిటీ.. అదే మూడు దశాబ్దాల ‘ప్రభుత్వ సేవ’ చేసిన ఉద్యోగికి మాత్రం మూడు రోజుల మందుల ఖర్చులకు కూడా సరిపోని పింఛను అన్నమాట!
CPS Pension Issues | చట్టాలు చేసేవారికి ఓ న్యాయం.. అమలుచేసేవారికి మరో న్యాయమా?
అసెంబ్లీలో తమ జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెంచుకోవాలన్నా.. ప్రతి టర్మ్‌కు అదనపు పింఛన్లు కల్పించుకోవాలన్నా ఒక్క నిమిషంలో ఏకగ్రీవంగా బిల్లులు పాస్ చేసుకునే నాయకులకు.. ముసలితనంలో ఉద్యోగుల కడుపు నింపే OPS (పాత పెన్షన్ విధానం) పునరుద్ధరించాలంటే మాత్రం “ఖజానా ఖాళీ అవుతుంది”, “ఆర్థిక భారం పెరుగుతుంది” అని సాకులు చెప్పడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?
ఓట్ల కోసం వేల కోట్లు బిల్లింగ్ ఇచ్చే ప్రభుత్వాలు.. ‘గురువు’ స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడిని ఎల్బీ స్టేడియంలో పల్లీల బుట్ట పట్టుకునేలా చేయడం, తమకు మాత్రం ‘మల్టీపుల్ పెన్షన్ల’తో పండగ చేసుకోవడం వ్యవస్థలోని నైతిక దిగజారుడుతనానికి పరాకాష్ట!
ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి, కంటితుడుపు చర్యలు కాకుండా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని ఉద్యోగ లోకం డిమాండ్ చేస్తోంది. లేదంటే, ఈ పల్లీల బుట్టలే రేపటి నిరసనలకు ప్రతీకలుగా మారక తప్పవు!