అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Suvendu Adhikari | బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆలయంలో చేపలు తిన్నారు. దుర్గా పూజ సమయంలో మాంసాహారం తీసుకునే బెంగాలీ హిందువులను ఒక హిందూ పూజారి మందలించడంతో వివాదం చెలరేగింది. దీంతో సీఎం స్వయంగా ఆలయంలో చేపలు తినడం గమనార్హం.
దేశంలోని చాలా ఆలయాల్లో మాంసాహారం నిషేధం. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం దేవుళ్లకు మాంసాహారం నివేధిస్తారు. పశ్చిమ బెంగాల్ (Bengal)లోని కొన్ని ఆలయాల్లో మాంసాహారం తినడం సాధారణ విషయం. అయితే దుర్గా పూజ సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలని బాగేశ్వర్ బాబా సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దుర్గా పూజ సమయంలో మాంసాహారం తీసుకునే బెంగాలీ హిందువులను ఆయన కపట భక్తులు అన్నారు. దుర్గా పూజ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో మాంసం, మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు.
Suvendu Adhikari | తీవ్ర ఆగ్రహం
బెంగాల్‌లో చాలా మంది దుర్గాపూజ సమయంలో మాంసాహారం తింటారు. అంతేగాకుండా అమ్మవారికి మాంసాహారం నివేధిస్తారు. బాబా వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎం సువేందు అధికారి కాళీఘాట్ ఆలయంలో స్వయంగా చేపలతో వండిన ఆహారాన్ని తినడంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. కాళీ దేవికి చేపలు, బలి ఇచ్చిన మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం కాళీఘాట్ సంప్రదాయం. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని భక్తులు స్వీకరిస్తారు. అధికారి వీడియోను ఉదహరిస్తూ, శాకాహార-మాంసాహార వివాదానికి ఇక ముగింపు పలకాలని అధికార పార్టీ సూచించింది.
Suvendu Adhikari | వివాదం ముగియాలి
ఈ వివాదం ఇక్కడితో ముగియాలి. బెంగాల్ విశ్వాసాలు, సంప్రదాయాలు మరియు జీవనశైలిని గౌరవిస్తూ, కాళీఘాట్‌లో ముఖ్యమంత్రి సువేందు అధికారి అమ్మవారి సంప్రదాయ ‘చేపల భోగ్’లో పాల్గొన్నారని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. బెంగాల్ ప్రయోజనాలు, సంప్రదాయాలు, బెంగాల్‌కు మేలు చేసే విషయాల కోసం బీజేపీ ఎల్లప్పుడూ దృఢంగా నిలబడుతుందన్నారు. బాగేశ్వర్ బాబా మరో ప్రపంచం నుండి వచ్చారని, బెంగాల్ ప్రజలు ఏమి తినాలనేది నిర్ణయించే హక్కు ఆయనకు లేదని బీజేపీ బెంగాల్ విభాగం అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అన్నారు.
ఇది కూడా చదవండి..: Maharashtra Accident | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి