అక్షరటుడే వెబ్‌డెస్క్: Bell of Arms Theft | హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన సంచలన ఆయుధాల చోరీ కేసును అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
గత నెల ఆగస్టు 31న బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఈ భారీ చోరీ జరిగింది. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్-ఛార్జ్, బుల్లెట్లు ఇచ్చే అమ్మునిషన్ సెక్షన్ ఇన్-ఛార్జ్ సహకారంతోనే ఈ ఆయుధాల దొంగతనం జరిగినట్లు విచారణలో తేలిందని డీజీపీ వివరించారు. ఘటన అనంతరం నిర్వహించిన విస్తృత తనిఖీల్లో చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Bell of Arms Theft | దర్యాప్తులో విస్తుపోయే విషయాలు..
కేసు దర్యాప్తులో భాగంగా మొదట బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లోకి ప్రవేశం ఉన్న 16 మందిని అధికారులు గుర్తించి విచారించారు. ఆర్మ్స్ కోర్ట్ ఇన్-ఛార్జ్ వినోద్ కుమార్, అమ్మునిషన్స్ కోర్ట్ ఇన్-ఛార్జ్ బల్లి మధులను అనుమానితులుగా ప్రశ్నించినప్పటికీ తొలి దశలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత హవాల్దార్లు టి.పి.ఎస్. రావు, మల్లేశ్ అలియాస్ రాజులను తీవ్రంగా విచారించారు. ఈ క్రమంలో మల్లేశ్ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో అధికారులు అతడి కదలికలను గుర్తించారు. విచారణకు రావాలని కోరినప్పటికీ రాకపోవడం, ప్రశ్నించే సమయంలో ముఖంలో భయం కనిపించడంతో అనుమానం బలపడింది.
Bell of Arms Theft | భార్య నిలదీయడంతో ..
మల్లేశ్ తీరుపై సందేహం రావడంతో అధికారులు అతడి భార్యకు కేసు వివరాలను వివరించారు. దీంతో ఆమె తన భర్తను గట్టిగా నిలదీయడంతో మల్లేశ్ నిజం ఒప్పుకున్నాడు. భార్య అందించిన కీలక సమాచారంతో అధికారులు మల్లేశ్ వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం వద్ద రెక్కీ నిర్వహించిన మల్లేశ్.. రాత్రివేళ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, 30న కార్గిల్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించి 31న పక్కాగా ఈ చోరీకి పాల్పడ్డాడు.
Bell of Arms Theft | అరెస్ట్ వెనుక కారణాలు ఇవే..
ప్రస్తుతం మల్లేశ్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, ఆయుధాలను మొదట ఒకచోట పాతిపెట్టి ఆ తర్వాత మరో ప్రాంతానికి ఎందుకు మార్చాడనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. ఆర్మీ నుంచి తనను అకారణంగా తొలగించారన్న కోపంతోనే మల్లేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. ఈ చోరీకి ఎలాంటి ఇంటర్నేషనల్ కనెక్షన్‌లు లేవని స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ఈ ప్రమాదకర యత్నాన్ని సమర్థవంతంగా భగ్నం చేసిన మిలిటరీ అధికారులు, పోలీసు సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.
#WATCH | Hyderabad, Telangana DGP CV Anand says, “…Again, he entered and took those magazine covers, and he went back to his house in Balaji Nagar. He reached there at 4:34 a.m., as could be made out from the CCTV footage. He put the magazine bag in a white Brezza car, which he… https://t.co/Xyzc5dO53u pic.twitter.com/uhSDUuoWPZ
— ANI (@ANI) September 11, 2026
ఇది కూడా చదవండి: Nagpur Bank Robbery | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి దోపిడీ