Orange Retail Finance | రూ.50 కోట్ల ఎన్‌సీడీ జారీ పూర్తి.. లిస్టెడ్ రుణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్

ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.50 కోట్ల విలువైన తొలి లిస్టెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (NCD) జారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Orange Retail Finance | ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియా ( India ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.50 కోట్ల విలువైన తొలి లిస్టెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (NCD) జారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దీని ద్వారా కంపెనీ అధికారికంగా లిస్టెడ్ రుణ మార్కెట్లోకి ప్రవేశించింది. యూఎంఐ క్యాపిటల్ సహకారంతో ఆర్థిక సంవత్సరం 2027 కోసం తలపెట్టిన రూ.200 కోట్ల లిస్టెడ్ ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా ఇది తొలి విడత జారీ కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆరెంజ్ చేపట్టిన రూ.300 కోట్ల రుణ నిధుల సేకరణ ప్రణాళికలో ఇది భాగం.

Orange Retail Finance | కీలక మార్పులు..

రైతులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఆరెంజ్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఉన్న టూ-వీలర్ రుణాల వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకుని.. ప్రస్తుతం బంగారు రుణాలు, ఎంఎస్ఎంఈ ఆస్తిపై రుణాలు వంటి సురక్షిత రిటైల్ ఆర్థిక సేవల వైపు అడుగులు వేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుతో పోర్ట్‌ఫోలియో నాణ్యత గణనీయంగా మెరుగుపడి, స్థూల ఎన్‌పీఏ (GNPA) గతంలో ఉన్న 9.3 శాతం నుంచి ఏకంగా 2.1 – 2.8 శాతానికి తగ్గింది. ప్రస్తుతం కంపెనీ మూలధన సమృద్ధి నిష్పత్తి 34 శాతం వద్ద ఉంది.

Orange Retail Finance | భవిష్యత్తు ప్రణాళికలు..

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ మార్కెట్లలో రుణ వితరణను అందిస్తున్న ఈ సంస్థ.. రుణగ్రహీతలలో మహిళల వాటాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల నిర్వహణ ఆస్తుల (AUM) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా 2031 నాటికి ఏయూఎంను రూ.3,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది.

Orange Retail Finance | యాజమాన్యం స్పందన..

మా నిధుల వనరులను విస్తృతం చేయడానికి, దీర్ఘకాలిక మూలధన ఖర్చును తగ్గించుకోవడానికి ఇది మొదటి అడుగు అని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శరవణన్ కందన్ తెలిపారు. మొదటి లిస్టెడ్ ఎన్‌సీడీని పూర్తి చేయడం వైవిధ్యమైన నిధుల వనరుల వైపు సాగిస్తున్న ప్రయాణంలో కీలక మైలురాయి అని ఫౌండర్, ఎండీ, సీఈవో ఎబెనెజర్ డేనియల్ జి పేర్కొన్నారు. తాజా నిధుల సేకరణ ద్వారా ఆరెంజ్ సంస్థ పాత టూ-వీలర్ రుణదాత హోదా నుంచి పూర్తిగా సురక్షితమైన రిటైల్ ఫైనాన్స్ సంస్థగా రూపాంతరం చెందుతోంది.

ఇది కూడా చదవండి:  Modi Putin Meeting | చర్చలతోనే ఘర్షణలకు పరిష్కారం.. పుతిన్​తో ప్రధాని మోదీ భేటీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *