అక్షరటుడే వెబ్‌డెస్క్: Axis Bank AI Services | ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఎండ్ టూ ఎండ్ పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ (Hitachi Payment Services) సంయుక్తంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత రెండు నూతన సేవలను ముంబైలో ప్రారంభించాయి. ‘ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్: డిజిటల్ బ్యాంకింగ్ పాయింట్ 2.0’ (Express Banking: Digital Banking Point 2.0), ‘ఏఐ సౌండ్‌బాక్స్’ (AI Soundbox) పేరుతో వీటిని ఆవిష్కరించారు.
Axis Bank AI Services | ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్..
గతంలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రారంభించిన డిజిటల్ బ్యాంకింగ్ పాయింట్‌కు అధునాతన రూపమే ఈ వెర్షన్ 2.0. ప్రస్తుతం ఇది ఐఐఎం అహ్మదాబాద్, ఎల్‌పీయూ, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు, కార్పొరేట్ క్యాంపస్‌లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు వివిధ స్క్రీన్‌లు మారుస్తూ ఇబ్బంది పడకుండా, నేచురల్ లాంగ్వేజ్ (సహజ భాష) ద్వారా ఏఐ అసిస్టెంట్‌తో మాట్లాడి సేవలు పొందవచ్చు. బహుళ భాషల్లో అందుబాటు ఉండే ఈ విధానం ద్వారా ఖాతా తెరవడం, ఇన్‌స్టంట్ కార్డ్ జారీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లోన్ అప్లికేషన్లు, బిల్లుల చెల్లింపులు వంటి సేవలను సులభంగా పూర్తి చేయవచ్చు.
Axis Bank AI Services | ఏఐ సౌండ్‌బాక్స్ ..
సాధారణ పేమెంట్ నోటిఫికేషన్ పరికరానికి అత్యాధునిక ఏఐ సాంకేతికతను జోడించి ఈ సౌండ్‌బాక్స్‌ను రూపొందించారు. కేవలం బటన్ నొక్కి వ్యాపారులు తమకు కావలసిన చెల్లింపుల వివరాలను వాయిస్ ద్వారా అడగవచ్చు. ఉదాహరణకు “ఈరోజు నా మొత్తం సేల్స్ ఎంత?” అని అడిగితే క్షణాల్లో సమాధానం లభిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారి సౌలభ్యం కోసం ఇది 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే నెట్‌వర్క్ సమస్యలను స్వయంగా సరిదిద్దుకుంటూ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తుంది.
ఈ నూతన ఆవిష్కరణల ద్వారా కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని, వ్యాపారుల చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని యాక్సిస్ బ్యాంక్ , హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ప్రతినిధులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Modi Putin Meeting | చర్చలతోనే ఘర్షణలకు పరిష్కారం.. పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ