అక్షరటుడే వెబ్‌డెస్క్: INDIA Alliance | రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో వేడి మొదలైంది. అధికార ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా సమావేశమైన కూటమి నేతలు, ఇకపై ప్రతి రెండు నెలలకోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనున్న సమావేశానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి ముందే కూటమికి దూరమైన పాత మిత్రపక్షాలను తిరిగి ఏకం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు తమిళనాడులో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
INDIA Alliance | తమిళనాడులో మారుతున్న సమీకరణాలు..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయాలు నాటకీయంగా మారాయి. తొమ్మిదేళ్ల సుదీర్ఘ మిత్రబంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్, డీఎంకేకు దూరమైంది. మెజారిటీ మార్కుకు దూరంగా ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది. అదేవిధంగా వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములు కాగా, కమ్యూనిస్టులు బయటి నుండి మద్దతు ఇస్తున్నారు.
INDIA Alliance | కేరళ, బెంగాల్ తరహా వ్యూహం..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో, కేరళలో సీపీఎంతో రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కలిసి ప్రయాణిస్తోంది. మమతా బెనర్జీ సైతం కూటమి సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదే తరహా వ్యూహాన్ని తమిళనాడులో కూడా అమలు చేయాలని వీసీకే అధినేత తిరుమావళవన్ ప్రతిపాదించారు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్నా, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు డీఎంకే, టీవీకే, కాంగ్రెస్ కలిసి పనిచేయాలన్నది ఆయన ప్రతిపాదన. వీసీకే ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది.
INDIA Alliance| మండిపడ్డ డీఎంకే..
వీసీకే ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై స్పందించిన డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ మాకు వెన్నుపోటు పొడిచింది. అటువంటి పరిస్థితుల్లో కేరళ, బెంగాల్ మోడల్ ఇక్కడ అస్సలు సాధ్యం కాదు. జాతీయ ప్రయోజనాలను వదిలేసి స్వార్థ రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్, ఇప్పుడు వీసీకేను రాయబారిగా వాడుకుంటూ మమ్మల్ని ఒప్పించాలని చూస్తోంది. పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో ఎలా చేర్చుకుంటారు? మా నాయకత్వం ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదు” అని స్పష్టం చేశారు.
INDIA Alliance | కొనసాగుతున్న సందిగ్ధత..
మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తును, ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటి కావాలి” అని కోరారు. ఏది ఏమైనప్పటికీ, తమిళనాడులో డీఎంకే – కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న ఈ విభేదాలు, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి సమన్వయానికి పెద్ద అడ్డంకిగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం