అక్షరటుడే వెబ్డెస్క్: Dharmapuri Arvind | రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై కనీస అవగాహన లేదని, పాలనలో ‘ఏబీసీడీలు’ నేర్చుకోవడానికి ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే దిక్కు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రాష్ట్రాన్ని అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు.
Dharmapuri Arvind | బీఆర్ఎస్పై ఎంపీ ప్రశ్నల వర్షం..
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. “బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్లు కేవలం ‘క్విడ్ ప్రో కో’ (Quid Pro Quo) ద్వారా వచ్చినవే” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత చేసిన ఈ ఆరోపణలపై కేటీఆర్, హరీశ్ రావులు స్పష్టత ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. “హరీశ్ రావు రక్తాలు పారించడం కాదు.. నిజాలు పారించాలి. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టడించడం కాదు, ముందు కేసీఆర్ను నిలదీయాలి” అని ఆయన ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీకే ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరారు.
Dharmapuri Arvind | జగిత్యాల ఎమ్మెల్యేపై ఆగ్రహం..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఉద్దేశించి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ తెలంగాణలోనే ‘వరెస్ట్ ఎమ్మెల్యే’ అని, ఆయన ఏ పార్టీలో ఉన్నా పద్ధతులు మార్చుకోలేదని విమర్శించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు అడిగితే, కేవలం 2 ఎకరాలు ఇచ్చి నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. నిధుల విడుదల విషయంలో బీజేపీపై జరుగుతున్న ప్రచారానికి సమాధానమిస్తూ, లబ్ధిదారుల జాబితా ఇవ్వకపోవడం వల్లే నిధులు ఆగిపోయాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
Dharmapuri Arvind | బీజేపీదే విజయం..
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని, రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన పరిపాలన అందించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఏబీసీడీలు నేర్పించాలి: అర్వింద్@Arvindharmapuri @revanth_anumula @BJP4Telangana @ncbn#Arvind #RevanthReddy #ChandrababuNaidu #Telangana #TelanganaPolitics #BJP #BJPTelangana https://t.co/lWhTdRe8pG
— Rachakonda Sagar (@Sagar0i) July 12, 2026
ఇది కూడా చదవండి: Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం