అక్షరటుడే, వెబ్డెస్క్: AP Govt DA | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు విడతలకు సంబంధించిన కరవు భత్యం (డీఏ) విడుదలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది.
AP Govt DA | బకాయిలు విడతల వారీగా జమ..
2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే 1.82 శాతం డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఈ కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 20 నెలల బకాయిలను 2028 జనవరి, మార్చి, మే, జులై నెలల్లో జమ చేయనుంది.
అదేవిధంగా 2024 జులై 1 నుంచి అమల్లోకి వచ్చే 2.73 శాతం డీఏను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో నాలుగు విడతలుగా చెల్లించనున్నారు.
AP Govt DA | పింఛనుదారులకు ఎలా అంటే..
ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు కూడా ఇదే విధానంలో డీఏ బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.
డీఏ పెంపుతో ఉద్యోగులు, పింఛనుదారుల నెలవారీ ఆదాయంలో స్వల్పంగా పెరుగుదల కనిపించనుంది. అయితే గత కాలానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విడతలవారీగా అందుకోనున్నారు.