Teak Tree Cutting Fine | టేకు చెట్లు నరికివేత కేసులో సాంపల్లి సర్పంచ్ భర్తకు జరిమానా

ఎలాంటి అనుమతి, నోటీసు ఇవ్వకుండా టేకు చెట్లకు జేసీబీతో తొలగింపజేసిన కేసులో డిచ్​పల్లి మండలం సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్తకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Teak Tree Cutting Fine | ఎలాంటి అనుమతి, నోటీసు ఇవ్వకుండా టేకు చెట్లకు జేసీబీతో తొలగింపజేసిన కేసులో డిచ్​పల్లి (Dichpally) మండలం సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్తకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Teak Tree Cutting Fine | అసలేం జరిగింది..

సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల నిమిత్తం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య తన ఇంటి పక్కన చాలా ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు వనాన్ని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే, గ్రామ సర్పంచ్ భర్త ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో 12టేకు చెట్లను జేసీబీతో తొలగించారని బాధితుడు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Teak Tree Cutting Fine | నేరుగా డీఎఫ్‌వోకు ఫిర్యాదు!

ఏళ్ల తరబడి పెంచుకున్న టేకు చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంతరెడ్డి నర్సయ్య నేరుగా జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫిర్యాదు చేశాడు. తాను చాలా ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో జేసీబీ సహాయంతో తొలగించారని, చెట్లు తొలగించే క్రమంలో తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వలేదని, ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శిను సంప్రదిస్తే వివరణ ఇవ్వలేదని, వాల్టా చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు అంతరెడ్డి నర్సయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎఫ్‌వోకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశంతో అటవీ శాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లికి వెళ్లి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.

Teak Tree Cutting Fine | రూ. 13వేల జరిమానా..!

అనుమతి లేకుండా, వ్యక్తిగతంగా పెంచుకుంటున్న చెట్లను తొలగించడం చట్టరీత్యా నేరమని తేలడంతో.. సాంపల్లి సర్పంచ్ భర్త ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధిస్తూ అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసులో పంచాయతీ కార్యదర్శి పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెట్లు తొలగింపు ఘటన జూలై నెలలో జరగడంతో అప్పుడే ఫిర్యాదు చేసినప్పటికీ అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టకుండా తీవ్ర కాలయాపన చేశారని బాధితుడు నర్సయ్య వాపోతున్నాడు. అధికారం ఉంది కదా అని.. గ్రామంలో ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే సర్పంచ్ భర్తకు, అటవీ శాఖ విధించిన ఈ జరిమానా ఒక గట్టి హెచ్చరిక అని గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ తెలుగు 10లో డే 9.. కెప్టెన్సీ టాస్క్‌తో హౌస్‌లో మరోసారి హీట్ పెరిగిపోయింది!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *