అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Liberation Day | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar )పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్ర, నిజాం నిరంకుశ పాలన, రాష్ట్ర అభివృద్ధి , ప్రస్తుత రాజకీయ అంశాలపై ఇద్దరు ప్రముఖ నేతలు తీవ్రస్థైలో స్పందించారు.
Hyderabad Liberation Day | ఒకే రోజు నాలుగు పండుగలు ..
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. తెలంగాణ ప్రజలకు నేడు ఒకేసారి నాలుగు పండుగలు వచ్చాయని అన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవం ఒకే రోజు రావడం ఎంతో విశేషమని పేర్కొన్నారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, తెలంగాణకు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో కాస్త ఆలస్యంగా విమోచనం లభించిందని గుర్తుచేశారు.
నిజాం అరాచక పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అలాంటి పాలకుడిని అసెంబ్లీలో గొప్పవాడిగా కీర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. నిజాంను పొగిడే నాయకులు బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వంటి ప్రాంతాల్లో జరిగిన మారణహోమాలను, ప్రాణత్యాగాలను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, తెలంగాణ మలిదశ ఉద్యమ ఫలితంగా సాధించుకున్న రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తోందని, గడచిన 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు అభివృద్ధిని విస్మరించి అవినీతి ఆరోపణలు, విమర్శలకే పరిమితమవుతున్నాయని, ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకోవాలని పిలుపునిచ్చారు.
Hyderabad Liberation Day | కిషన్ రెడ్డి ఆగ్రహం..
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలనా కాలంలో తెలుగు భాషను అణచివేసి, ఉర్దూను బలవంతంగా రుద్దారని మండిపడ్డారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం సీఎం రేవంత్ రెడ్డి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజాం గనుక మంచి పాలకుడైతే, ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎందుకు సాయుధ పోరాటం చేశారని సీఎంను ప్రశ్నించారు. గ్రామాల్లో బురుజులు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందో, భారత సైన్యం ఎందుకు సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కొన్ని రాజకీయ పార్టీలు వందేమాతరం గేయన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. నిజాం పాలన ముగిసినా ఆయన వారసత్వ రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2029 నాటికి తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకునే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఉందా అని సవాల్ విసిరారు.
Hyderabad Liberation Day | ఘనంగా సాంస్కృతిక వేడుకలు..
ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ విమోచన పోరాట చరిత్రను కళ్లకు కట్టేలా ప్రత్యేక చారిత్రక ప్రదర్శన, ‘హైదరాబాద్ విమోచనం’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, వందేమాతరం సామూహిక గానం, కేంద్ర సాయుధ పోలీసు బలగాల కవాతు ఆకట్టుకున్నాయి. ఈ పోరాట చైతన్యాన్ని పాట, సంగీతం , దృశ్య రూపాల ద్వారా భావితరాలకు అందిస్తున్న ప్రముఖ కళాకారులు ఆకుల నాగేశ్వర్, వందేమాతరం శ్రీనివాస్, దీపికలను ఈ సందర్భంగా మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి: KTR Revanth Reddy | గోడల మీద రాతలు రాసే రేవంత్‌కు అన్ని ఆస్తులు ఎక్కడివి : కేటీఆర్