అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | కామారెడ్డి జిల్లా (Kamareddy District) బాన్సువాడ ఆస్పత్రిలో ఇటీవల ప్రసవించిన బాలింతలు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 13న సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకోగా.. నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం పరామర్శించారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను హరీశ్ రావు ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు.
Harish Rao | విచారణ చేపట్టాలి
ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటి వరకు కనీస విచారణ చేయలేదన్నారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు బాధితులను పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లులు కోలుకోకపోతే వారి పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలింతలతో పాటు వారి పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. దీంతో పిల్లలు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
Harish Rao | మెరుగైన వైద్యం అందించాలి
బీఆర్ఎస్ హయాంలో మాతా శిశు సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి గర్భిణులు భయపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆ కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: MLA Rakesh Reddy | ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నాయకుల మెడళ్లోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని సూచన..