Bihar Girl Harassment | బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై వేధింపులు.. రాహుల్ గాంధీ ఆగ్రహం

బిహార్‌లోని జమూయ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన అఘాయిత్యం వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bihar Girl Harassment | బిహార్‌లోని జమూయ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన అఘాయిత్యం వెలుగు చూసింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలికను దుండగులు అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జమూయ్ పట్టణంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని మరో బాలుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి బయలుదేరింది. జమూయ్-లఖిసరాయ్ ప్రధాన రహదారిపై సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు.

Bihar Girl Harassment | దారుణంగా వేధించడం ..

బాలికను భయపెడుతూ దారుణంగా వేధించడం ప్రారంభించారు. “ప్లీజ్.. వదిలేయండి” అని బాధితురాలు కన్నీళ్లతో వేడుకున్నా ఆ మృగాళ్ల మనసు కరగలేదు. పదేపదే బాలికపై చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. బాలుడి కాలర్ పట్టుకుని లాగుతూ, బాలికను బలవంతంగా దూరంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలిక తప్పించుకోవడానికి యత్నించగా, ముఖానికి ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. చివరకు బాలుడు వారి చెర నుంచి తప్పించుకుని బాలిక దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, నిందితులు మళ్లీ వెంబడించారు. బాధితురాలు మరోసారి ప్రాధేయపడిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

Bihar Girl Harassment | నిందితుల అరెస్ట్..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన జమూయ్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి, ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జమూయ్ ఎస్పీ విశ్వజిత్ దయాళ్ తెలిపారు.

Bihar Girl Harassment | రాహుల్ గాంధీ స్పందన..

ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బహిరంగ రహదారిపై, సాయంత్రం 7 గంటల సమయంలోనూ ఓ బాలికకు రక్షణ లేకపోవడంపై బీహార్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఈ ఘటనను మంత్రి సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని, ఎస్పీతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామని తెలిపారు. అయితే, ఒక్క ఘటన ఆధారంగా బీహార్‌ను ‘జంగిల్ రాజ్’గా చిత్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 


ఇది కూడా చదవండి:  ACB Raids Nzb Municipality | నిజామాబాద్​ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన ఇద్దరు సిబ్బంది

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *