అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha RIMS Fire | ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ రిమ్స్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ అగ్నిప్రమాద బాధితులైన శిశువుల తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్పిన ముఖ్యమంత్రి.. అదే జిల్లాలో ఐదుగురు పసిపిల్లలు చనిపోతే వచ్చి పరామర్శించేందుకు కూడా సమయం లేదా అని నిలదీశారు. ఫుట్‌బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు సీఎంకు సమయం ఉంటోంది కానీ మైనార్టీ, ఆదివాసీ పిల్లలు ప్రాణాలు కోల్పోతే చూసే తీరిక లేదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Kavitha RIMS Fire | నెల రోజుల గడువు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy )తాము ఒక నెల రోజులు గడువు ఇస్తున్నామని కవిత స్పష్టం చేశారు. ఆ లోపు పెండింగ్‌లో ఉన్న హెల్త్ బిల్స్ రిలీజ్ చేయాలని, ఆదివాసీ గూడేలకు రోడ్లు వేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల లెక్కలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాము విధించిన గడువులోగా ఆసుపత్రికి నిధులు విడుదల కాకపోయినా, రోడ్లు బాగుచేయకపోయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీలతో కలిసి ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. తాము ఆశామాషీగా వచ్చి వెళ్లే టూరిస్ట్ పార్టీ కాదని స్పష్టం చేశారు.
Kavitha RIMS Fire | ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుస్థితి..
ప్రభుత్వాసుపత్రుల్లో సగం మంది స్టాఫ్, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా లేరని కవిత ఆరోపించారు. కనీసం చీపుర్లు, ఫినాయిల్, దూది, మందులు కొనుగోలు చేయడానికి కూడా మెయింటెనెన్స్ బడ్జెట్ లేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.500 కోట్లు ఉన్నాయంటే ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ఏసీ పేలి ఇంత ఘోరం జరిగితే.. ఆసుపత్రిలో ఏకంగా 150 ఏసీలు ఉన్నా కనీసం ఒక్క మెకానిక్ కూడా లేకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి స్వయంగా ఆసుపత్రిని సందర్శించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hero Motors IPO | హీరో మోటార్స్.. లిస్టింగ్ తర్వాత అదుర్స్..