అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Man Murdered | తమ గంజాయి విక్రయాల గురించిన వివరాలను పోలీసులకు అందిస్తున్నాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని అతని సహచరులే అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఉప్పరపల్లి వద్ద ఉన్న పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. మృతుడిని ఎండీ వసీం (32)గా గుర్తించారు. గురువారం సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో వసీం తన సహచరులైన సొహైల్ (షోయబ్), ఇలియాస్‌లతో సమావేశమయ్యాడు. ఆ సమయంలో వారి మధ్య గంజాయి విక్రయాలు, పోలీసుల సమాచారానికి సంబంధించి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Hyderabad Man Murdered | విచక్షణారహితరంగా దాడి..
మాటమాట పెరగడంతో సొహైల్, ఇలియాస్ లు ఒక్కసారిగా కత్తులతో వసీంపై దాడికి దిగారు. వసీంను నేలపై పడేసి కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తూ, కాళ్లతో తన్నారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన వసీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad Man Murdered | వివరాలు వెల్లడించిన రాజేంద్రనగర్ ఏసీపీ
రాజేంద్రనగర్ ఏసీపీ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మృతుడు వసీం తమ గంజాయి వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని నిందితులు అనుమానించారు. ఈ కక్షతోనే అతనిపై దాడి చేసి హతమార్చారు” అని తెలిపారు.
బాధితుడు వసీంతో పాటు దాడికి పాల్పడిన నిందితులపై కూడా గతంలో గంజాయి సరఫరా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కేసు విచారణ కొనసాగుతోంది.