అక్షరటుడే, వెబ్డెస్క్: Metpalli CDPO ACB Arrest | ప్రభుత్వ అధికారుల లంచాల వికృత చేష్టలు రోజు రోజుకూ కొత్త వింతలను సంతరించుకుంటున్నాయి. వాయిదాల పద్ధతి (EMI)లో నెలకు ఇంతింత అని ఫిక్స్ చేసి లంచం వసూలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Metpalli CDPO ACB Arrest | నెగటివ్ నివేదికలు ఇవ్వకుండా
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO)గా విధులు నిర్వర్తిస్తున్న దారోజు పద్మ అనే అధికారిణి పరిధిలో 21 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే, ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేసినప్పుడు నెగటివ్ (ప్రతికూల) నివేదికలు ఇవ్వకుండా ఉండాలంటే, తనకు ప్రతి నెల మామూళ్లు సమర్పించుకోవాలని షరతు విధించింది.
ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ. 1,000 చొప్పున.. 21 కేంద్రాలకు కలిపి నెలకు రూ. 21,000 ‘ఈఎంఐ’ మోడల్‌లో వసూలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో గత 3 నెలలకు సంబంధించిన మొత్తం రూ. 63,000 లంచం డబ్బులను బాధితుల నుంచి తీసుకుంటుండగా.. ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పక్కా వ్యూహంతో దాడులు చేసి పట్టుకున్నారు.
Metpalli CDPO ACB Arrest | ఉద్యోగాలకే ఎసరు పెడతా..
కష్టపడి పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లను బెదిరిస్తూ.. ‘నెలవారీ మామూళ్లు ఇవ్వకపోతే మీపై నెగటివ్ రిపోర్టు రాసి ఉద్యోగాలకే ఎసరు పెడతా’ అని బ్లాక్‌మెయిల్ చేయడంతో విసుగుచెందిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, పద్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకుంది.
అధికారిణి దారోజు పద్మపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచే లంచాల వసూళ్లకు దిగిన సదరు సీడీపీఓ తీరుపై స్థానికులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.