Leopard Movement Nizamabad | జనాల్లోకి చిరుతలు.. భయాందోళనలో ప్రజలు

ఉమ్మడిజిల్లాలో చిరుత పులుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Leopard Movement Nizamabad | ఉమ్మడి జిల్లాలో (Nizamabad) చిరుత పులుల సంచారం ప్రస్తుతం సర్వసాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు అడవికి మాత్రమే పరిమితమైన చిరుత పులులు నేడు దర్జాగా జనాల్లోకి వస్తున్నాయి. గ్రామాల శివారులో ప్రధాన రహదారులపై చిరుత పులుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రి పూట బయటకు వెళ్లాలంటే అటవీ ప్రాంత శివారు రైతులు భయంతో వణికిపోతున్నారు.

Leopard Movement Nizamabad | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. వ్యవసాయ భూములు, ఇళ్ల మధ్య చిరుతలను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పశువుల కొట్టాలపై దాడులు చేసి ఆవులు, గేదెలు, మేకలను చంపుకుని తిని ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇటీవల చిరుత పులుల సంచారం ఎక్కువ కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.  అడవిలో ఉండాల్సిన చిరుతలు జనాల్లోకి వస్తున్నాయి. అడవులు ఆనుకుని ఉన్న గ్రామాలు మాత్రమే కాకుండా ఇతర గ్రామాల్లో సైతం చిరుతలు సంచరిస్తున్నాయి. వ్యవసాయ పొలాలకు ఆనుకుని ఉన్న ఇళ్ల వద్ద కొందరు రైతులు పశువుల కోసం ప్రత్యేకంగా షెడ్లు వేసుకుంటున్నారు. వాటిని చూస్తున్న చిరుతలు పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. అలాగే వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లిన పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. చిరుత పులుల సంచారం.. పశువులపై వరుస దాడుల నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసుకునే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అడవికి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు.

Leopard Movement Nizamabad | తాజాగా మోపాల్​ మండలంలో..

మోపాల్​ మండలం మోతీరాం నాయక్​ తండా నుంచి కాల్పోల్​ వెళ్లే దారిలో శుక్రవారం కొందరికి చిరుత కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన వారు వెంటనే సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్​ చేశారు. అటవీశాఖ అధికారులు సైతం మోపాల్​ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఒంటరిగా రాత్రివేళల్లో బయటకు రావొద్దని.. అత్యవసరమైతే తప్ప అటవీప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారులకు సూచించారు. జూలైలో ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఓ పౌల్ట్రీ ఫాం సమీపంలో చిరుత సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయ్యింది.

Leopard Movement Nizamabad | ఉమ్మడి జిల్లాలో వరుస దాడులు

ఈ ఏడాది మొదట్లో తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, పళ్లెగడ్డ తండా, కన్కల్, మోతె శివారులో చిరుతలు పశువులపై దాడులు చేశాయి. మే 19న జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామంలో పశువుల పాకపై చిరుత దాడిలో ఓ గేదె మృతి చెందింది. ఆగస్ట్ 31న నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ శివారులో ఓ రైతు పొలం వద్దకు వెళ్తుండగా చిరుత కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గత నెల 25న జుక్కల్ మండలం వజ్రాఖండి గ్రామ శివారులో చిరుత పాదముద్రలు లభించాయి.

ఈ నెల 3న పిట్లం మండలం చిల్లర్గి గ్రామ శివారులో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. గతంలో అడవిలో తాగడానికి సెలయేర్లు, కుంటలు పుష్కలంగా ఉండేవి.  అవి ఉండేందుకు దట్టమైన పొదలు ఉండేవి. గ్రామాల్లో 10 శాతం భూమి పశువుల మేతకు ఉండటంతో మనుషులు అడవిలోకి వెళ్లేవారు కాదు. ప్రస్తుతం ఈ వసతులు అడవిలో లేకుండా పోయాయి. అక్రమ వేటతో అడవిలో చిరుతలకు ఆహార జంతువులు తగ్గిపోయాయి. మేత భూములు కబ్జాలకు గురై పశువుల కాపరులు అడవిలోకి వెళ్లడంతో చిరుతలు అడవి బాట వదిలి జనాల్లోకి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: పాత ఇల్లు కొంటున్నారా..? ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *