Jal Jeevan Mission 2.0 | ప్రొద్దుటూరులో అమరజీవి జలధార – జల్ జీవన్ మిషన్ ప్రారంభం

పశ్చిమ రాయలసీమలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంయుక్తంగా పర్యటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jal Jeevan Mission 2.0 | పశ్చిమ రాయలసీమలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంయుక్తంగా పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన “జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార” పథకానికి నేతలు ఘనంగా శ్రీకారం చుట్టారు. కొత్తపల్లి వద్ద ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించి, రాష్ట్రంలోని 27 లక్షల పైచిలుకు గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే మహాయజ్ఞానికి తెరతీశారు.

Jal Jeevan Mission 2.0 | రాజకీయాలకు తావులేదు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. “ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. మీ ఆవేదన, ఆవేశం నాకు తెలుసు.. దయచేసి అందరూ సంయమనం పాటించాలి. అవతలివారు హద్దులు మీరితేనే కదా మనం యుద్ధం చేసేది” అంటూ సభలో ఉన్న అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

Jal Jeevan Mission 2.0 | మినీ ముంబైగా ప్రొద్దుటూరు..

ప్రొద్దుటూరు ప్రాంతాన్ని ‘మినీ ముంబై’గా అభివర్ణించిన పవన్.. ఈ గడ్డ పౌరుషాలకు పెట్టింది పేరు అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరువకూడదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ప్రజల సంక్షేమం కోసమని చెబుతూ.. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో రూ. 280 కోట్లతో తాగునీటి సమస్యను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు.

Jal Jeevan Mission 2.0 | వివక్షకు తావులేదు.

గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని పవన్ విమర్శించారు. నిలిచిపోయిన నిధులను మళ్లీ రాష్ట్రానికి రప్పించేందుకు తాము కేంద్ర మంత్రులను స్వయంగా కలిశామని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి చిన్నపాటి వివక్షకు తావులేకుండా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని.. అతి త్వరలోనే ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:  Supreme Court Delhi Police | వారి మనసుల్లో భయం సృష్టించాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *