అక్షరటుడే వెబ్‌డెస్క్: Amul Dairy Plant Telangana | తెలంగాణలో ప్రసిద్ధ డైరీ బ్రాండ్ ‘అముల్’ (Amul) తన మొదటి అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో అముల్ తొలి మెగా ప్లాంట్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అక్టోబర్ 4, 2026న భూమిపూజ నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు, కేంద్ర సహకార సంఘం కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని, జీసీఎంఎంఎఫ్ (అముల్) చైర్మన్ శ్రీ అశోక్‌భాయ్ చౌదరి, సబర్ డైరీ చైర్మన్ శ్రీ షమాల్‌భాయ్ పటేల్ తదితరులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి 5,000 మందికి పైగా రైతులు హాజరయ్యారు.
Amul Dairy Plant Telangana | మెగా డైరీ ప్లాంట్..
అముల్ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వ్యవస్థాపక సభ్యుడైన ‘సబర్‌కాంథా జిల్లా సహకార పాలు ఉత్పత్తిదారుల సంఘం’ (సబర్ డైరీ) ఈ మెగా ప్లాంట్‌ను నిర్వహించనుంది. విక్షిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యానికి అనుగుణంగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఈ డైరీ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు.
Amul Dairy Plant Telangana |ప్లాంట్ ప్రత్యేకతలు ..
ఈ నూతన డైరీ ప్లాంట్ ద్వారా రోజువారీగా భారీ స్థాయిలో ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ముఖ్యంగా రోజుకు 5 లక్షల లీటర్ల తాజా పాలు ప్రాసెసింగ్ సామర్థ్యంతో పాటు, 200 మెట్రిక్ టన్నుల పెరుగు (Curd), రోజుకు 30,000 లీటర్ల చొప్పున మజ్జిగ , లస్సీ, అలాగే 10 మెట్రిక్ టన్నుల పన్నీర్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వీటితో పాటు రోజుకు 50,000 లీటర్ల ఐస్‌క్రీమ్, 3 మెట్రిక్ టన్నుల స్వీట్లు, అలాగే 5 మెట్రిక్ టన్నుల చొప్పున బేకరీ ఉత్పత్తులు , నెయ్యి తయారీ సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి ఉంటుంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులన్నింటినీ ‘అముల్’ బ్రాండ్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా విక్రయించనున్నారు.
Amul Dairy Plant Telangana | రైతులకు ఉపాధి అవకాశాలు..
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌తో తెలంగాణలో సుమారు 20,000 రైతు కుటుంబాలు అనుసంధానమై ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 1 లక్ష రైతు కుటుంబాలకు చేర్చడంతో పాటు, రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పాలు సేకరించాలని సబర్ డైరీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన “వైట్ రెవల్యూషన్ 2.0” (White Revolution 2.0) కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, రైతులకు సుస్థిర ఉపాధిని అందించడం, వినియోగదారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అముల్ తన ప్రయాణాన్ని మరింత ముందుకు సాగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ సహకార సంస్థగా ఉన్న అముల్.. ప్రస్తుతం 3.6 మిలియన్ల మంది రైతు భాగస్వాములతో 50కి పైగా దేశాల్లో తన సేవలను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: BC Commission Visit | 7న నిజామాబాద్‌కు బీసీ కమిషన్.. వీడీసీల బహిష్కరణలపై సమావేశం