అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congo River Boat Accident | ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కాంగో నదిలో రెండు మోటరైజ్డ్ పడవలు పరస్పరం ఢీకొన్న ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.
Congo River Boat Accident | రెండు పడవలు ఎదురెదురుగా ఢీకొనడంతో..
కాంగోలోని ఈక్వేటియర్ ప్రావిన్స్‌లోని గోంబే-లూకోలేలా ప్రాంతం సమీపంలో ఆదివారం, అక్టోబర్ 4 సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పడవలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం ఒక పడవ పూర్తిగా మునిగిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఇప్పటికే 30 మందికి పైగా మృతి చెందినట్లు ఈక్వేటియర్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ క్రిస్పిన్ ఎంపుటూ తెలిపారు. మరికొందరు ప్రయాణికుల ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Akshara Today | Fearless Journalism, a Growing Voice for the People..
Congo River Boat Accident | తరచూ పడవ ప్రమాదాలు
ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే రాత్రి సమయంలో నదిలో పడవలను నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని మంత్రి క్రిస్పిన్ ఎంపుటూ పేర్కొన్నారు. పడవల నిర్వహణ, అధికంగా ప్రయాణికులు, సరకు తరలింపు వంటి అంశాలపై కూడా అధికారులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగోలోని మారుమూల ప్రాంతాల్లో రహదారి రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో ప్రజలు నదీ రవాణాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో పడవ ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాల అమలు, రాత్రి వేళ పడవ ప్రయాణాలపై నియంత్రణ వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.
గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి పూర్తి కారణాలు, పడవల్లో ప్రయాణిస్తున్న వారి కచ్చితమైన సంఖ్యపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.