Koukour Girl Murder | సికింద్రాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలిక హత్య!

కౌకూర్‌లో కలకలం.. అదృశ్యమైన చిన్నారి మృతదేహం సంపులో లభ్యం.. వాచ్​మన్​పై పోలీసుల అనుమానం.. కిడ్నాప్‌ కోణంలోనూ దర్యాప్తు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Koukour Girl Murder | అప్పటివరకు అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఆడుకున్న ఆరేళ్ల చిన్నారి అనూహ్యంగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించగా.. చివరకు ఆ బాలిక విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్‌ పరిధిలోని బొల్లారం సమీప కౌకూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్‌ అపార్ట్‌మెంట్‌లో గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిన్నారి సెల్లార్‌లో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కొంతసేపటి వరకు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Koukour Girl Murder | సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. బాలిక వాచ్​మన్​తో కలిసి ఉన్న దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. దీంతో అతడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు.

చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించి ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగించారు. నిందితుడు బాలిక కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్‌ చేసినట్లు సమాచారం అందడంతో, ఆ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరించారు. అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Koukour Girl Murder | సంపులో చేతులు, కాళ్లు కట్టేసిన స్థితిలో..

గాలింపు చర్యల మధ్య చిన్నారి మృతదేహం సంపులో లభ్యమైనట్లు సమాచారం. బాలిక కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని సంపులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు వాచ్​మన్​ కారణమై ఉండవచ్చనే కోణంలో అతడి కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం.

Koukour Girl Murder | నిందితుడి కోసం గాలింపు..

ఆరేళ్ల చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికంగా కూడా ఈ ఘటన ఆవేదనకు గురిచేసింది. చిన్నారి అదృశ్యం నుంచి మృతదేహం లభ్యమయ్యే వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడి ఆచూకీ, హత్యకు దారితీసిన పరిస్థితులు, కిడ్నాప్‌ వెనుక ఉద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *