అక్షరటుడే వెబ్డెస్క్: Mary Millben CJP Allegations | ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీకి అమెరికాలోని ఎంపిక చేసిన దాతల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోదీకి ( Narendra Modi )పూర్తి మద్దతు ప్రకటిస్తూ, సీజేపీ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
Mary Millben CJP Allegations | మేరీ మిల్బెన్ పోస్ట్..
ఎన్నికల జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీజేపీ తదితర ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని మిల్బెన్ ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఆయా దేశాలకు చెందిన వ్యక్తులను అమెరికాలో చదివించి, వారిని తీవ్రవాద ధోరణుల వైపు మళ్లించి, తిరిగి స్వదేశానికి పంపి అక్కడ గందరగోళం సృష్టించేందుకు కొన్ని వర్గాలు నిధులు సమకూరుస్తున్నాయని ఆమె ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.
Mary Millben CJP Allegations | ప్రధాని మోదీకి మద్దతు..
సీజేపీ వ్యవస్థాపకుడి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అమెరికాలో విద్యనభ్యసించిన వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా భారతదేశ పాలనను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆమె పరోక్షంగా విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజా జీవితంలో ఉన్నారని, ఆయన విదేశీ డిస్రప్టివ్ (విఘటనకర) శక్తుల ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోరని స్పష్టం చేశారు.
భారతదేశ అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మిల్బెన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మౌనంగా ఉండకుండా, దేశ ప్రయోజనాల కోసం యువత ముందుకు వచ్చి శాంతియుతంగా ప్రతిఘటించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ