అక్షరటుడే వెబ్డెస్క్: Atla Bathukamma | తెలంగాణ ( Telangana )సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగలో భాగంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తున్నారు. పాడిపంటలతో, సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ప్రతిరోజూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబరాలు, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మలను దాటుకుని నేడు ఐదవ రోజైన ‘అట్ల బతుకమ్మ’ వేడుకలు కొనసాగుతున్నాయి.
Atla Bathukamma | బియ్యంతో చేసిన అట్లు..
ఐదవ రోజు ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోశలను గౌరమ్మకు ఎంతో నిష్టగా నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యపు పిండితో చేసిన అట్లను అమ్మవారికి నివేదించి, ఆ తర్వాత తోటి ఆడపిల్లలకు వాయనంగా ఇస్తారు. తంగేడు, గునుగు, చామంతి, మందారం, గుమ్మడి పూలతో అందంగా ఐదు ఎత్తుల్లో బతుకమ్మలను తీర్చిదిద్దుతారు. తెలంగాణ అచ్చమైన సంస్కృతి ఉట్టిపడేలా ఆటపాటలతో ఊరూవాడా కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో గౌరమ్మకు ‘పోయి రావమ్మా’ అంటూ వీడ్కోలు పలుకుతారు.
ఇది కూడా చదవండి: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ