అక్షరటుడే, వెబ్‌డెస్క్: MBA Graduate Embraces Sainthood| ఎంబీఏ డిగ్రీ.. చేతినిండా విజయవంతమైన వ్యాపారం.. చుట్టూ కోట్ల రూపాయల ఆస్తులు, మోడ్రన్ లైఫ్! నేటి తరం యువత కలలు కనే ఇవన్నీ ఉన్నా.. తనకు అసలైన ఆత్మసంతృప్తి దొరకడం లేదని భావించింది 25 ఏళ్ల ఓ యువతి. విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి, ఆధ్యాత్మిక శాంతి కోసం సన్యాస దీక్ష స్వీకరించేందుకు సిద్ధమైంది.
లక్డీకాపూల్ Lakdi ka pul లోని ఎన్టీసీసీ (NTCC) భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ధమాన్ స్థానకవాసి జైన్ శ్రావక్ సంఘ్ ప్రతినిధులు, తల్లిదండ్రులతో కలిసి సంజనా జీ లూనావత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
MBA Graduate Embraces Sainthood | సాధ్వి వైపు ప్రయాణం
మహారాష్ట్రకు చెందిన కవర్ లాల్, మమత దంపతుల కుమార్తె సంజనా జీ లూనావత్. వీరి కుటుంబం ఆటోమొబైల్, ఇతర వ్యాపారాల్లో స్థిరపడింది. ముంబయిలో ఎంబీఏ (MBA) పూర్తి చేసిన సంజనా, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బోటిక్ (Boutique) యజమానిగా సొంత కాళ్లపై నిలబడి సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగారు.
MBA Graduate Embraces Sainthood | చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక బీజం
సంపద, హోదా అన్నీ ఉన్నా మనసులో ఏదో వెలితి ఉందని సంజనా పేర్కొన్నారు. “నాకు 12 ఏళ్ల వయసు నుంచే జైన తత్వశాస్త్రం, గురువుల బోధనలపై ఆసక్తి మొదలైంది. ఆ జిజ్ఞాసే నన్ను ఈ రోజు సాధ్వి జీవితాన్ని ఎంచుకునేలా చేసింది. కోట్ల ఆస్తులు, విలాసాల కంటే నాకు ఆత్మశాంతే ముఖ్యం” అని ఆమె స్పష్టం చేశారు.
కూతురు సన్యాసం తీసుకుంటానంటే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోవడం కష్టం. ఈ సందర్భంగా సంజనా తల్లి మమత మాట్లాడుతూ.. “మొదట నా బిడ్డ నిర్ణయాన్ని అంగీకరించడం మాకు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ, ఆమె తన లక్ష్యంపై ఎంతో పట్టుదలగా ఉంది. మేము ఒప్పుకొనే వరకు అన్నపానీయాలు మానేసింది. చివరకు ఆమె ఆధ్యాత్మిక తపనను అర్థం చేసుకుని అంగీకరించక తప్పలేదు” అని భావోద్వేగంతో తెలిపారు.
MBA Graduate Embraces Sainthood | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దీక్షా మహోత్సవం
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 14, 15 తేదీల్లో సంజనా జీ లూనావత్ ‘జైన్ భగవతి దీక్ష’ను స్వీకరించనున్నారు. ఈ అపురూప ఆధ్యాత్మిక వేడుకకు తెలంగాణ డీజీపీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సమావేశంలో సంఘం ఛైర్మన్, చీఫ్ కన్వీనర్ స్వరూప్‌చంద్ కోఠారి, అధ్యక్షుడు అన్నరాజ్ బఫ్నా, దీక్షా మహోత్సవ ప్రణాళిక కన్వీనర్ మనోజ్ కోఠారి, ప్రధాన కార్యదర్శి పవన్ కటారియా, కన్వీనర్లు ధర్మేందర్ నహర్, సజ్జన్ గాంధీ తదితరులు పాల్గొని ఏర్పాట్ల వివరాలను తెలిపారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
నేటి పోటీ ప్రపంచంలో డబ్బు, ఆస్తుల వెంట పరుగులు తీస్తున్న యువతకు.. 25 ఏళ్ల వయసులోనే సకల భోగాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సంజనా నిర్ణయం ఒక అరుదైన స్ఫూర్తిగా నిలుస్తోంది.