Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!

వైద్యశాఖాధికారుల అవినీతిపై మీడియా కోడై కూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ (DM&HO) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు, సిబ్బంది చేతులు తడపనిదే ఏ ఒక్క ఫైలు ముందడుగు పడటం లేదని, ప్రతి పనికీ ఒక ప్రత్యేకమైన ‘రేట్ కార్డ్’ సెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Nizamabad DMHO Corruption | అన్నింటికీ ‘మామూళ్ల’ పర్వం!

ఉద్యోగుల డెప్యుటేషన్లు, వర్క్ టు ఆర్డర్లు (Work to Order) ఇవ్వడం దగ్గర నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, పేర్ల మార్పు, లైసెన్స్ రెన్యూవల్స్ వరకు ప్రతిదాంట్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. చివరికి ఉద్యోగుల పెట్రోల్ అలవెన్సులు, అద్దె వాహనాల బిల్లుల మంజూరులోనూ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి.

ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి యజమానులు, సిబ్బంది ఈ వసూళ్లను ప్రశ్నిస్తే “ఆసుపత్రులను సీజ్ చేస్తాం” అని బెదిరింపులకు దిగుతున్నారని, పైఅధికారులకు ఫిర్యాదు చేస్తే నిబంధనల పేరుతో మరింత వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad DMHO Corruption | నేషనల్ హెల్త్ మిషన్‌లో పెట్రోల్ బిల్లుల దోపిడీ!

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద పనిచేసే క్షేత్రస్థాయి ఉద్యోగులకు నెలకు ₹7,500 చొప్పున వచ్చే పెట్రోల్ అలవెన్సుల మంజూరులో తీవ్ర అక్రమాలు వెలుగు చూశాయి.

పెట్రోల్ బిల్లులు క్లియర్ చేయాలంటే వచ్చే మొత్తంలో 20% కమీషన్ ఇవ్వాలని సదరు విభాగపు సీనియర్ అసిస్టెంట్ ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని, ఏకంగా UPI ట్రాన్సాక్షన్ల ద్వారా లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Nizamabad DMHO Corruption | అధికారుల పేర్లు వాడుతూ బెదిరింపులు

ఆన్‌లైన్ బదిలీలు వద్దని ఉద్యోగులు వారించినా, “ఈ డబ్బులు నా ఒక్కడికే కాదు.. డీఎంహెచ్ఓ, ఏఓ అందరికీ పంపాలి, నాకేమీ భయం లేదు” అని బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

Harvard Courses in Hyderabad | డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు : సీఎం రేవంత్​

గత నాలుగేళ్లుగా రావలసిన బకాయిలను అరకొరగా ఇప్పిస్తూ అందులోనూ 20% నొక్కేస్తున్నారని, అసలు విధుల్లో లేని అనర్హుల పేరిట కూడా బిల్లులు సృష్టించి ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంటే సొంతం చేసుకున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

Nizamabad DMHO Corruption | అద్దె వాహనాల బిల్లుల్లోనూ అక్రమాలు & TDS ఉల్లంఘన

జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని 7 అద్దె వాహనాలకు గాను ఒక్కో వాహనానికి నెలకు ₹33,000 చెల్లిస్తున్నారు. కాగా, వీటికి కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారు.

లేదంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని, పాత బకాయిలు నిలిపివేస్తామని బెదిరిస్తుండటంతో వాహన యజమానులు డీఎంహెచ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

మరో దారుణ విషయం ఏమిటంటే.. అద్దె వాహనాలకు ప్రైవేట్ డ్రైవర్లను వినియోగించాల్సి ఉండగా, డీఎంహెచ్ఓ వాహనానికి ప్రభుత్వ డ్రైవర్లను వాడుకుంటున్నారు.

అంతేకాకుండా, నిబంధనల ప్రకారం కట్ చేయాల్సిన టీడీఎస్ (TDS) మినహాయించకుండానే నిధులు విడుదల చేస్తూ తీవ్ర ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

Nizamabad DMHO Corruption | ‘ముఖ్య అనుచరుడే’ చక్రం తిప్పుతున్నారా?

సదరు సీనియర్ అసిస్టెంట్ డీఎంహెచ్ఓ కి ‘ముఖ్య అనుచరుడి’గా చెలామణి అవుతూ, ఆయన అభయహస్తంతోనే జిల్లా వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు చక్రం తిప్పుతున్నారని శాఖలో టాక్ నడుస్తోంది. చివరికి తను ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీహెచ్​సీ (PHC) లో కూడా ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

Nizamabad DMHO Corruption | కలెక్టర్, ఏసీబీ సమగ్ర విచారణ చేపట్టాలి!

వైద్యశాఖాధికారుల అవినీతిపై మీడియా కోడై కూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లా వైద్యారోగ్య శాఖలో బహిరంగంగా సాగుతున్న ఈ దందాపై ఇకనైనా జిల్లా కలెక్టర్, నిఘా వర్గాలు, అవినీతి నిరోధక శాఖ (ACB) తక్షణమే స్పందించాలని బాధితులు, సదరు శాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిష్పాక్షిక విచారణ జరిపి, విధుల్లో లేనివారి పేరిట బిల్లులు స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్‌తో పాటు ఆయన వెనుక ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *