Starlink India Row | స్టార్‌లింక్ వివాదం వేళ పొలిటికల్ హీట్.. మస్క్ ట్వీట్‌కు రాహుల్ గాంధీ మద్దతు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘‘స్టార్‌లింక్’’ భారత్‌లో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

Shivam nagarani

 అక్షరటుడే వెబ్‌డెస్క్: Starlink India Row | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘‘స్టార్‌లింక్’’ భారత్‌లో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. దేశంలో కొందరు వ్యాపారవేత్తలు తమ సేవలను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించడం, అంతేకాకుండా నేరుగా ముఖేష్ అంబానీ పేరును ప్రస్తావిస్తూ భారతదేశానికి నిజమైన బాస్ అంబానీనా అని ప్రశ్నించడం సంచలనంగా మారింది. గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా భారత్ తమకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ( Rahul Gandhi )స్పందిస్తూ మస్క్‌కు మద్దతుగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘భారత్‌కు స్వాగతం, ఎలాన్. ఇక్కడ మరో వ్యక్తి ఎవరో తెలుసుకునే వరకు ఆగండి’’ అంటూ ఆయన చేసిన కామెంట్ రాజకీయంగా కలకలం రేపింది. రాహుల్ పరోక్షంగా గౌతమ్ అదానీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ గుప్పిట్లో ఉందంటూ రాహుల్ గతంలోనూ అనేకసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

 Starlink India Row | బీజేపీ ఎదురుదాడి..

మస్క్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది. స్టార్‌లింక్‌తో సహా మరో రెండు శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థల దరఖాస్తులు భద్రతాపరమైన పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో, మణిపూర్‌లో ఉగ్రవాదులు లేదా తిరుగుబాటుదారుల వద్ద స్టార్‌లింక్ పరికరాలు లభించినట్లు నివేదికలు ఉన్నాయని బీజేపీ గుర్తుచేస్తోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ప్రశ్నార్థకంగా ఉందని, ఆయన విదేశీ వ్యాపారవేత్తలకు వత్తాసు పలుకుతూ స్వదేశీ పారిశ్రామికవేత్తలపై నిందలు వేస్తున్నారని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

 Starlink India Row | ద్వంద్వ ప్రమాణాల ఆరోపణ..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఎయిర్‌టెల్, జియో సంస్థలు స్టార్‌లింక్‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అమెరికా ఒత్తిడి వల్లే మోదీ ప్రభుత్వం దీనికి సహకరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మోదీ ప్రభుత్వం స్టార్‌లింక్‌కు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తప్పుబట్టారు. ఒకప్పుడు లైసెన్సులు ఇస్తున్నారంటూ విమర్శించిన వారే, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదంటూ యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్ తీరులో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు.

 Starlink India Row| సమర్థించుకున్న కాంగ్రెస్..

మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమర్థిస్తోంది. రాహుల్ మస్క్‌కు కానీ, ప్రభుత్వ విధానాలకు కానీ మద్దతు ఇవ్వలేదని, కేవలం భారత మార్కెట్ ఒకరిద్దరు వ్యక్తుల గుప్పిట్లో లేదా గుత్తాధిపత్యంలో ఉందనే వాస్తయాన్నే ఆయన ప్రస్తావించారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. మొత్తంగా స్టార్‌లింక్ ఎంట్రీ అంశం దేశ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

ఇది కూడా చదవండి: Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *