అక్షరటుడే, వెబ్డెస్క్:Telangana Drought Situation | తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం , వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంటల సాగుపై వాటి ప్రభావం గురించి చర్చించేందుకు ఈనెల 12న మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. వర్షాలు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై సీఎం ఈ భేటీలో సమీక్షించనున్నారు.
Telangana Drought Situation | కీలక రంగాలపై సమీక్ష..
ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి భరోసా, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి సరఫరా తీరు, అలాగే గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ కరువు పరిస్థితులపై కూలంకషంగా చర్చించిన సంగతి తెలిసిందే.
Telangana Drought Situation | ప్రత్యేక ప్యాకేజీ కోసం విజ్ఞప్తి..
రాష్ట్రంలోని కరువు మండలాలను అధికారికంగా గుర్తించడంతో పాటు, బాధిత రైతులకు తగిన ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ. 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కోరింది.
ఈ నెల 12న జరగనున్న భేటీలో మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన ప్రణాళికలు, కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, త్వరలో నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు అలాగే వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చే సలహాలు, సూచనలపై సమగ్ర కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Kidnap Case | హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్