అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Firemen GO 86 | అగ్నిమాపక శాఖ ఉద్యోగుల్లో జీవో 86 చిచ్చు పెట్టింది. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఈ జీవోతో తాము తీవ్రంగా నష్టపోతామని ఫైర్‌ఫైటర్లు ఆందోళన చెందుతున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది పరుగులు తీస్తారు. ప్రాణాలకు తెగించి ఆస్తి, ప్రాణ నష్టం జరకుండా కాపాడుతారు. వేడిని, మంటలను లెక్క చేయకుండా ఫైర్మన్లు మంటలను ఆర్పి వేస్తారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వీరు పదోన్నతుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదోన్నతుల కోసం ప్రభుత్వం జారీ చేనసిన జీవో 86 తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నారు.
Firemen GO 86 | పదోన్నతులకు అడ్డంకి..
జీవో 86తో ఫైర్‌మన్ పోస్ట్ నుంచి పదోన్నతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు అంటున్నారు. డ్రైవర్ ఆపరేటర్ పోస్టుకు సంబంధించిన అర్హతలు, పదోన్నతుల క్రమంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చి, నిబంధనలను పునఃపరిశీలించాలని కోరుతున్నారు. గతంలో ఫైర్‌మన్ నుంచి లీడింగ్ ఫైర్‌మన్ హోదాకు పదోన్నతి పొందే అవకాశం ఉండేది. అర్హతలు, సీనియారిటీ, ఖాళీల ఆధారంగా ఫైర్మెన్లకు అవకాశం వచ్చేది. జీవో 86తో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుకు సంబంధించిన అర్హతలు, పదోన్నతుల క్రమం మారడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారి ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.
Firemen GO 86 | లైసెన్స్ ఉంటేనే..
హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఫైర్మెన్లకు పదోన్నతి అనే మెలిక సరికాదంటున్నారు. తాము విధుల్లో చేరే సమయంలో లేని నిబంధనలను ఇప్పుడు ప్రవేశ పెడితే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం తమ రిటైర్మెంట్ వరకు కూడా ప్రమోషన్ రాదని పేర్కొంటున్నారు. పాత నిబంధనల మేరకే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : NHM Employees | ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం : కవిత