అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సుమారు రెండు దశాబ్దాల తర్వాత మరో ఐపీవో వస్తోంది. రిలయన్స్ డిజిటల్, టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఐపీవో సబ్స్క్రిప్షన్ బుధవారం ప్రారంభం కానుంది.
జియో ప్లాట్‌ఫామ్స్‌ను 2019లో స్థాపించారు. ఇది మైజియో, జియోసినిమా, జియోసావన్, జియో ఇన్ఫోకామ్ వంటి డిజిటల్ సేవల అప్లికేషన్లను అందిస్తోంది. బ్యాంకింగ్, యుటిలిటీస్, రవాణా, తయారీ, ప్రభుత్వ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలతో సహా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ, క్లౌడ్ సొల్యూషన్స్, ఐవోటీ సేవలు, యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్‌లు, మేనేజ్డ్ సర్వీసెస్, సెక్యూరిటీ సొల్యూషన్స్, ప్రైవేట్ 5జీ ఆఫరింగ్‌ల వంటి సేవలనూ ఆఫర్ చేస్తోంది. ఇది తన అధునాతన కనెక్టివిటీ మరియు డిజిటల్ సేవలతో 524 మిలియన్లకుపైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
Jio Platforms IPO | రూ. 30,213 కోట్ల ఐపీవో..
దేశంలోనే అతిపెద్ద ఐపీవో (IPO)గా జియో ప్లాట్‌ఫామ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 30,213 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జియో ఇన్ఫోకామ్ రుణాల తిరిగి చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
Jio Platforms IPO | ఉద్యోగులు, రిలయన్స్ వాటాదారులకూ వాటా..
జియో ఐపీవోలో రిలయన్స్ ఉద్యోగులు, వాటాదారులకు కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. రూ.500 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు, రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు కేటాయించారు. రిలయన్స్ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్ ఇచ్చారు. అక్టోబరు 14 నాటికి రిలయన్స్ షేర్లు కలిగి ఉన్నవారు Share holders కోటాలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Jio Platforms IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించింది. ఒక లాట్ లో 12 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠ ధర ప్రకారం ఒక లాట్‌కు రూ.13,428 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు share holders కేటగిరీలోనూ బిడ్లు వేయవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం నాటికి ఒక్కో షేరుపై రూ. 270 ప్రీమియం ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 24 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
Jio Platforms IPO | ఐపీవో తేదీలు..
అక్టోబర్ 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. 23న ముగుస్తుంది. షేర్ల అలాట్మెంట్ స్టేటస్ 26న అర్ధరాత్రి దాటాక వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 28న స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి.
ఇది కూడా చదవండి..: Oct 21 Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ