K-Harmony Festa 2026 | హైదరాబాద్‌లో గ్లోబల్ కల్చరల్ ఫెస్ట్.. ప్రత్యేక ఆకర్షణగా కే-పాప్, పేరిణి నృత్యాల

భారతదేశం , దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  K-Harmony Festa 2026 | భారతదేశం , దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్  (  Hyderabad )నగరం వేదిక కానుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అక్టోబర్ 25న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ‘కె-హార్మనీ ఫెస్టా–2026’ (K-Harmony Festa-2026) పేరిట అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలు వివిధ దేశాల ప్రజల మధ్య మైత్రిని, పరస్పర అవగాహనను పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

K-Harmony Festa 2026 | అంతర్జాతీయ వేదిక..

భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయమని, అందులో తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి జూపల్లి అన్నారు. ఈ ఉత్సవంలో తెలంగాణ ప్రసిద్ధ పేరిణి శివతాండవ నృత్యం, డప్పుల దరువుతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల మన రాష్ట్ర కళా వైభవాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు పరిచయం చేసే గొప్ప అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

K-Harmony Festa 2026 | ప్రత్యేక ఆకర్షణగా ..

ఈ వేడుకలో దక్షిణ కొరియాకు చెందిన సాంప్రదాయ కళలు, సంగీతం, కొరియన్ సమరకళ ‘తైక్వాండో’ ప్రదర్శనలతో పాటు ఆధునిక సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ పొందిన ప్రముఖ కొరియన్ కె-పాప్ బృందం NTX ఇచ్చే ప్రత్యేక లైవ్ పర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

K-Harmony Festa 2026 | కొత్త ప్రాచుర్యం..

హైదరాబాద్ నగరం తనదైన చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటోందని మంత్రి వివరించారు. ఇలాంటి అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి (Cultural Exchange) కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌కు గ్లోబల్ కల్చరల్ హబ్‌గా మరింత గుర్తింపు లభిస్తుందని, అలాగే తెలంగాణ పర్యాటక రంగానికి సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Nizamabad Dasara Sammelanam | 23న జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ‘దసరా సమ్మేళనం’

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *