అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మొదట్లో లాభాల్లో దూసుకెళ్లినప్పటికీ.. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ తో భారీగా పతనమయ్యాయి. రెండు సూచీలు ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి 1.8 శాతం పడిపోయాయి.
Indian Stock Market | క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే భయాలు నెలకొన్నాయి. అంతేకాకుండా అమెరికాలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగ్గడం సైతం ఆందోళన కలిగిస్తోంది. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల పైన ట్రేడ్ అవుతున్నాయి. చమురు ధరలు గరిష్ట స్థాయిల వద్ద కొనసాగుతుండడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి పెద్ద ప్రతికూలాంశం. చాలాకాలంగా వంద డాలర్లపైనే కొనసాగుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది.
Indian Stock Market | లాభాలతో ప్రారంభమైనా..
భారత్ -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశంపై ఆశాభావం నెలకొనడంతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఐటీ స్టాక్స్ ప్రధాన సూచీలను పరుగులు తీయించాయి. అయితే ముడి చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. దీంతో ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఊచకోతకు గురయ్యాయి. దీంతో చాలామంది రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌పోలియోలు రక్తమోడాయి.
Indian Stock Market | ఇంట్రాడే గరిష్టాలనుంచి భారీ పతనం..
సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 485 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 345 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,453 పాయింట్లు పతనమైంది. 128 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 104 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 471 పాయింట్లు కోల్పోయింది. చివరి గంటలో మార్కెట్లు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 73,709 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 23,811 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 965 కంపెనీలు లాభపడగా 3,480 స్టాక్స్ నష్టపోయాయి. 195 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 92 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 388 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో, 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్ 3.40 శాతం, ఇన్ఫోసిస్ 3.31 శాతం, టెక్ మహీంద్రా 3.21 శాతం, టీసీఎస్ 2.68 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.80 శాతం పెరిగాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 3.33 శాతం, ఎటర్నల్ 2.71 శాతం, ట్రెంట్ 2.32 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.11 శాతం, ఎన్టీపీసీ 1.99 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Oppo Find X10 Pro | ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. రేపే భారత్‌లో విడుదల