అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Harish Rao Comments | అసెంబ్లీనా.. లేక కౌరవ సభనా?
అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు మహిళా శాసనసభ్యురాలి చీర లాగడం, మరో మహిళా నేత జుట్టు పట్టి నెట్టడం అత్యంత అమానుషమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది శాసనసభనా.. లేక కౌరవ సభనా? ప్రజా ప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం, మహిళా నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడమేనా ప్రజాపాలన?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, రైతులు, ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన వెయ్యి రోజుల వైఫల్యాలు బయటపడతాయని భయపడే తమపై పోలీసులను ఉసిగొల్పిందని దుయ్యబట్టారు.
Harish Rao Comments | హెచ్చరికలు..
ఈ ఘటనలో సునీతమ్మ చీర లాగిన, సబితమ్మ గొంతు నొక్కిన, అలాగే తోపులాటలో కిందపడిన జగదీష్‌రెడ్డి సహా నేతలను అడ్డుకున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ తోపులాటలో కేటీఆర్‌కు చేయి, ముఖంపై గాయాలయ్యాయని, యాదవ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సంజయ్‌లకు దెబ్బలు తగిలినా కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
Harish Rao Comments | నిరసన అడ్డుకుంటారా?
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ( Ragul Gandhi ) , ప్రియాంక గాంధీ నల్ల టీషర్ట్‌లు వేసుకొని పార్లమెంట్‌కు వెళ్తే తప్పు లేనిది, తాము ప్రజా సమస్యలపై నిరసన తెలిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సబ్‌జెక్టులపై చర్చ జరపడం ద్వారా ప్రభుత్వం పారిపోతోందని, తాము తప్పు చేయలేదనుకుంటే ఎజెండాలో ఆ అంశాలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారని, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత