అక్షరటుడే వెబ్డెస్క్: E20 Petrol | ఈ-20 పెట్రోల్ (E20 Petrol) విధానానికి వ్యతిరేకంగా ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఆధ్వర్యంలో రెండు లక్షలకు పైగా సంతకాలను సేకరించారు. ఈ ప్రతులను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
E20 Petrol | ట్రంప్ ఒత్తిడికి తలొగ్గొద్దు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే భారత్ అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గకూడదని, అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ-20 పెట్రోల్ విధానాన్ని అమలు చేయడం తగదంటూ ఈ విషయమై ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
E20 Petrol |కేంద్రం మాట మారుస్తోంది..
ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ తగ్గదని మొదట్లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతుందని అంగీకరించిందని కేజ్రీవాల్ విమర్శించారు. తొలుత ఇంజిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పి, ఇప్పుడు రబ్బర్ పార్టులపై ప్రభావం పడుతుందని చెబుతోందని తప్పుపట్టారు. విదేశీ మారక నిల్వలు పెరగాలంటే ఇథనాల్ తప్పనిసరి అని చెబుతున్నారని, కానీ అమెరికా నుంచే ఇథనాల్ కొనుగోలు చేస్తుంటే నిల్వలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. ఈ-20 విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజా ఉద్యమం కొనసాగుతుందని, ఈ ఆందోళనలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Stock Market Today | లాభాల స్వీకరణ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్