అక్షరటుడే వెబ్‌డెస్క్: Vinayaka Chavithi 2026 | ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలనే దానిపై భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి పండితులు ముగింపు పలికారు. చవితి తిథి రెండు రోజుల్లో వ్యాపించినప్పటికీ, శాస్త్ర నియమాలను పరిశీలించిన పండితులు (సెప్టెంబర్ 14, సోమవారమే వినాయక చవితి జరుపుకోవాలని స్పష్టం చేశారు. తెలుగు పంచాంగం ( Panchangam )ప్రకారం.. 2026 సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం 7:10 గంటల వరకు భాద్రపద శుద్ధ తదియ తిథి ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 7:11 గంటలకు శుద్ధ చవితి తిథి ప్రారంభమై, సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయం 7:44 గంటల వరకు కొనసాగుతుంది. సాధారణంగా సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారనే నియమం ఉన్నప్పటికీ, వినాయక చతుర్థి విషయంలో మరో ముఖ్యమైన శాస్త్ర నియమాన్ని పాటించాలని పండితులు చెబుతున్నారు.
Vinayaka Chavithi 2026 | చవితి తిథి..
పురాణ విశ్వాసాల ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజునే మధ్యాహ్న సమయంలో గణపతి అవతరించారు. అందువల్ల పండుగను నిర్ణయించేటప్పుడు మధ్యాహ్న సమయంలో చవితి తిథి ఉండటానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సెప్టెంబర్ 14న మధ్యాహ్న సమయంలో చవితి తిథి పూర్తిగా లభిస్తోంది. కానీ సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకే చవితి ముగిసిపోతుంది. ఈ కారణంగా మధ్యాహ్న వ్యాప్తి ఆధారంగా సెప్టెంబర్ 14నే పండుగ జరుపుకోవడం శాస్త్రసమ్మతమని పండితులు సూచించారు.
Vinayaka Chavithi 2026 | శుభ ముహూర్తాలు..
సెప్టెంబర్ 14, సోమవారం రోజున భక్తులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించవచ్చు. పూజా కార్యక్రమాలకు అనుకూలమైన ముహూర్తాలు ఇవే:
వినాయక ఆరాధన సమయం: ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు.
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:09 గంటల నుంచి 12:58 గంటల వరకు.
మధ్యాహ్న సమయంలో గణపతిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
Vinayaka Chavithi 2026 | ప్రత్యేక యోగాలు..
ఈ ఏడాది వినాయక చవితి రోజున జ్యోతిష్య పరంగా కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. సెప్టెంబర్ 14న బ్రహ్మ యోగం, ఇంద్ర యోగంతో పాటు మధ్యాహ్నం 1:55 గంటల వరకు చిత్రా నక్షత్రం, ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతాయి. ఈ శుభ యోగాల వల్ల గణపతి ఆరాధనకు ఈ రోజు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Vinayaka Chavithi 2026 | సెప్టెంబర్ 15న పూజ చేయవచ్చా?
ప్రధానంగా సెప్టెంబర్ 14నే పండుగ నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. అయితే ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ రోజు పూజ చేయలేని భక్తులు ఉంటే.. సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలలోపు (చవితి తిథి ముగిసేలోగా) పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రాంతీయ ఆచారాల్లో చిన్నపాటి తేడాలు ఉంటే స్థానిక పండితుల సూచనలను పాటించడం మంచిది.
ఇది కూడా చదవండి: Konda Surekha Warning | ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కొండా సురేఖ వార్నింగ్