అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Eye Emergency | దీపావళి వచ్చిందంటే దీపాల వెలుగులు.. టపాసుల సందడి.. పండుగ సంబరాలు! కానీ ఇదే సమయంలో ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితాంతం చీకటిని మిగిల్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా టపాసులు పేల్చేటప్పుడు కళ్లకు గాయాలైతే.. చికిత్సలో జరిగే ఆలస్యం శాశ్వత అంధత్వానికి దారితీయొచ్చు!
అయితే ఇకపై కంటి ప్రమాద బాధితులకు కీలక సమయంలో అండగా నిలిచేందుకు హైదరాబాద్ (Hyderabad)లో సరికొత్త అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి!
కంటి గాయాలకు ఆస్పత్రికి చేరకముందే ప్రాథమిక చికిత్స అందించేలా 108 అంబులెన్స్‌లలో ప్రత్యేక ఐ ఎమర్జెన్సీ సేవలను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో ప్రారంభం కావడం విశేషం!
Hyderabad Eye Emergency | 108 అంబులెన్స్‌లో ప్రత్యేక ఐ ఎమర్జెన్సీ కిట్లు!
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (108), సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
దీపావళి సమయంలో టపాసుల వల్ల కంటి గాయాలు సంభవించే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈఎంఆర్ఐ డైరెక్టర్ కే. కృష్ణంరాజు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇకపై కంటి గాయాలతో బాధపడుతున్న వారికి అంబులెన్స్‌లోనే అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రత్యేక ఐ ఎమర్జెన్సీ కిట్లు ఏర్పాటు చేశారు. అంటే.. ఆస్పత్రికి చేరుకునేలోపే బాధితులకు అత్యవసర వైద్య సహాయం అందించే దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగుగా పేర్కొనవచ్చు.!
Hyderabad Eye Emergency | ఆలస్యం చేస్తే చూపుకే ప్రమాదం!
కంటి గాయాల విషయంలో ప్రతి నిమిషం కీలకమే! ప్రమాదం జరిగిన తర్వాత సరైన వైద్య సహాయం అందడంలో ఆలస్యం జరిగితే చూపు కోల్పోయే ముప్పు పెరగొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా యువత, పని చేసే వయసులో ఉన్నవారిలో కంటి గాయాలు తీవ్రమైన దృష్టి సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో బాధితులకు వేగంగా ప్రాథమిక చికిత్స అందించడం, సరైన కంటి ఆస్పత్రికి తరలించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
Hyderabad Eye Emergency | సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..
ఈ సేవల్లో భాగంగా 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్లు, వైద్య సేవల శిక్షకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
కంటి గాయాలను గుర్తించడం.. వాటి తీవ్రతను అంచనా వేయడం.. అత్యవసర కాల్స్‌ను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత బాధితులను సరోజినీ దేవి కంటి ఆస్పత్రి లేదా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు వేగంగా తరలించేలా రిఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవల సమన్వయ బాధ్యతలను సరోజినీ దేవి ఆస్పత్రి నిర్వహించనుంది.
Hyderabad Eye Emergency | పండగ సంబరాలు..కావాలి కళ్లకు భద్రత
కంటి చూపు మన జీవితానికి ఎంతో విలువైనది. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో ఉంచడం, ప్రమాదం జరిగినప్పుడు కంటిని రుద్దకుండా వెంటనే వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం.
కంటిలో ఏదైనా వస్తువు గుచ్చుకున్నా, తీవ్రమైన గాయం జరిగినా దాన్ని స్వయంగా తొలగించడానికి ప్రయత్నించకండి. వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి.
మొత్తంగా చెప్పాలంటే.. కంటి ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాథమిక చికిత్స అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ 108 ఐ ఎమర్జెన్సీ పైలట్ ప్రాజెక్ట్ ఎంతోమందికి ఆశ కల్పిస్తోంది. సమయానికి చికిత్స.. సరైన ఆస్పత్రికి తరలింపు.. ఈ రెండు కలిస్తే విలువైన కంటి చూపును కాపాడే అవకాశం పెరుగుతుంది!
ఇది కూడా చదవండి..: Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ