Anti-Suicide Fans | యూనివర్సిటీ వినూత్న ప్రయోగం..హాస్టల్ గదుల్లో ‘యాంటీ సూసైడ్’ ఫ్యాన్లు

కాలేజీ విద్యార్థుల్లో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 'వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ' (VNSGU) ఒక కీలక అడుగు వేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anti-Suicide Fans | కాలేజీ విద్యార్థుల్లో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ ( Gujarat ) యూనివర్సిటీ’ (VNSGU) ఒక కీలక అడుగు వేసింది. హాస్టల్ గదుల్లో విద్యార్థులు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడకుండా చూసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 354 ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్లను’ (Anti-Suicide Fans) ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే ఒక విశ్వవిద్యాలయం ఇలాంటి భద్రతా చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Anti-Suicide Fans | ఫ్యాన్ ప్రత్యేకత ఏంటి?

ఒక్కో ఫ్యాన్‌కు సుమారు రూ. 1,500 అదనంగా వెచ్చించి ఈ ప్రత్యేక స్ప్రింగ్ పరికరాన్ని అమర్చారు. ఈ ఫ్యాన్‌పై సాధారణ బరువు కంటే ఎక్కువ, అనగా సుమారు 10 కిలోలకు మించి భారం పడగానే, ఇందులోని స్ప్రింగ్ మెకానిజం వెంటనే ఓపెన్ అవుతుంది. దీంతో ఫ్యాన్ వెంటనే కిందకు జారిపోవడమే కాకుండా, కరెంట్ సరఫరా కూడా తక్షణమే నిలిచిపోతుంది. దీనివల్ల మనిషి బరువును ఫ్యాన్ మోయలేక ఉరివేసుకునే ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కుతాయి. ఈ ప్రత్యేక పనితీరును యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషోర్‌సింహ్ చావ్డా స్వయంగా హాస్టల్ గదిని సందర్శించి, ఫ్యాన్‌కు దుప్పటి కట్టి కిందకు లాగి ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

Anti-Suicide Fans |  కౌన్సెలింగ్ కూడా ముఖ్యం..

దేశవ్యాప్తంగా అకడమిక్ ఒత్తిడి, కెరీర్ ఆందోళనల వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. గత ఆగస్టులో గుజరాత్‌కు చెందిన డాక్టర్ హర్ష్ పాండ్యా (30) అనే రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి సాంకేతిక రక్షణ చర్యలు భౌతికంగా ప్రమాదాలను అడ్డుకున్నప్పటికీ, విద్యార్థులకు నిపుణుల ద్వారా సకాలంలో మానసిక కౌన్సెలింగ్ అందించడమే అసలైన పరిష్కారమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Anti-Suicide Fans | భిన్నాభిప్రాయాలు..

యూనివర్సిటీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. విదేశాల్లో విద్యార్థులపై ఉండే చదువుల ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మనదేశంలో ఇలా ఫ్యాన్లు మార్చడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న మూల కారణాలను వదిలేసి తాత్కాలిక మార్గాలు వెతుకుతున్నారని విమర్శించారు. అయితే, తక్కువ ఖర్చుతో ప్రాణాలు కాపాడే ఇలాంటి సాంకేతికత మంచిదేనని, దీనికితోడు మెరుగైన కౌన్సెలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని మరికొందరు మద్దతు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ration Dealers | రేషన్​డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *