అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata Sons Controversy | టాటా ట్రస్ట్స్ , టాటా సన్స్ లార్డ్స్ బోర్డుల మధ్య ఛైర్మన్ నియామకం, కంపెనీ నిర్ణయాలపై వివాదం ముదురుతున్న వేళ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టాటా గ్రూప్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై దేశంలోని వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు.
Tata Sons Controversy | ఎంతకాలం మౌనంగా ఉంటారు?
భారతీయ వ్యాపార రంగం ప్రధాని మోదీ, అమిత్ షాల ఆటవస్తువు కాదని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ఏ వ్యాపారవేత్త కూడా నోరు విప్పేందుకు ధైర్యం చేయడం లేదని, చివరికి మిమ్మల్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మాట్లాడేందుకు వ్యాపారవేత్తలకు ధైర్యం లేకపోవచ్చని, కానీ తమకు ఆ ధైర్యం ఉందని, ఈ వ్యవహారంలో జరిగిన తప్పులకు కచ్చితంగా న్యాయం జరిగేలా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
Tata Sons Controversy | చెలరేగిన వివాదం..
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు (2027 ఫిబ్రవరి తర్వాత కూడా) ఆ పదవిలో కొనసాగించేందుకు సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అయితే, ఈ నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశ అజెండాలోనే చంద్రశేఖరన్ పునర్నియామక అంశం లేదని, కాబట్టి ఆ నిర్ణయం చెల్లుబాటు కాదని పేర్కొంటూ టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాశ్ ముఖోపాధ్యాయకు నోయల్ టాటా లేఖ రాశారు.
Tata Sons Controversy | బోర్డులో విభేదాలు..
టాటా సన్స్‌లో మూడింట రెండొంతుల వాటా ఉన్న టాటా ట్రస్ట్స్‌కు నేతృత్వం వహిస్తున్న నోయల్ టాటా బోర్డు ఓటింగ్‌లో చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని వ్యతిరేకించారు. అయితే, టాటా ట్రస్ట్స్ తరఫున ఉన్న మరో ప్రతినిధి వేణు శ్రీనివాసన్ మాత్రం మెజారిటీ సభ్యులతో కలిసి ఆ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. బోర్డు సభ్యుల మధ్య ఉన్న ఈ వ్యూహాత్మక విభేదాలు సంస్థాగత నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.
Tata Sons Controversy | స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌పైనా..
టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు కేవలం ఛైర్మన్ నియామకానికే పరిమితం కాలేదు. టాటా సన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలా వద్దా అనే ప్రధాన ప్రతిపాదనపై కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ టాటా వివాదంలోకి రాహుల్ గాంధీ నేరుగా జోక్యం చేసుకోవడంతో ఈ అంశం ఒక్కసారిగా రాజకీయ దుమారానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: KTR | రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన : కేటీఆర్