అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drinking Water | ఎల్నినో ప్రభావంతో విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ తదితర అధికారులతో కలిసి సమావేశమయ్యారు.
Drinking Water | జలాశయాల్లో అందుబాటులో నీళ్లు..
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన తాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్న నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు యాసంగిలో తక్కువ నీటి అవసరం ఉండే కూరగాయలు, పప్పు దినుసులు వంటి పంటలు విత్తుకోవాలని కోరారు. ఆరుతడి పంటలకు కూడా అవసరం మేరకే సాగు నీరు వినియోగించుకునేందుకు వీలుగా రైతుల ప్రయోజనాల కోసం అన్ని మండలాలకు సబ్సిడీపై రెయిన్ గన్స్ మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కో యూనిట్ ధర 24 వేలు ఉండగా, అందులో 8 వేలు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ కింద భరిస్తుందని తెలిపారు. పట్టణాల్లో కొత్త బోర్లు వేయకుండా చూడాలన్నారు.
Drinking Water | ఆర్వోబీ పనులు యుద్ధ ప్రాతిపదికన పర్తి చేయాలి
ఇదిలా ఉండగా.. మాధవనగర్, అర్సపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాధవనగర్ ఆర్వోబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 13 విడతల్లో రూ.42కోట్ల నిధులు కేటాయించిందన్నారు. అర్సపల్లి ఆర్వోబీకి కూడా రూ.11కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అయినప్పటికీ కొంత మంది నాయకులు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సౌకర్యార్థం ఆర్వోబీల నిర్మాణాలను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు గడువు విధించారు.
Drinking Water | నీటి వృథాను అరికట్టాలి..కలెక్టర్
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎక్కడ కూడా నీటి వృథా జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని.. రక్షిత నీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో నీటి పొదుపుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ అధికారులు ప్రవీణ్, అరవింద్ రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు స్వప్న, రాకేష్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sports Competitions | ఓటమి నుండి పాఠం నేర్చుకోవాలి..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి